Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ ది రెండో స్థానమో మూడో స్థానమో..బీజేపీకి 100సీట్లలో డిపాజిట్లు రావు:కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పినవన్నీ అబద్దాలేని కేటీఆర్ కొట్టిపారేశారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పేరును మార్చామని చెప్పడం శుద్ధ తప్పని ఖండించారు. అంబేద్కర్ ను గౌరవించింది టీఆర్ఎస్ పార్టీయేనని చెప్పుకొచ్చారు. 

minister ktr counter to rahula gandhi
Author
Hyderabad, First Published Oct 20, 2018, 7:37 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పినవన్నీ అబద్దాలేని కేటీఆర్ కొట్టిపారేశారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పేరును మార్చామని చెప్పడం శుద్ధ తప్పని ఖండించారు. అంబేద్కర్ ను గౌరవించింది టీఆర్ఎస్ పార్టీయేనని చెప్పుకొచ్చారు. 

అంబేద్కర్ ను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ కు భారతరత్న రాకుండా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ ఆరోపించారు. చివరికి వీపీ సింగ్ ప్రభుత్వం అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చిందని గుర్తు చేశారు. మరోవైపు మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమాన పరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నిలదీశారు. 

పీవీ అంత్యక్రియలను కూడా సరిగ్గా నిర్వహించలేదని దుయ్యబుట్టారు. ఘాట్ విషయంలోనూ కాంగ్రెస్ వివక్ష చూపించిందని ఆరోపించారు. పీవీ, జయశంకర్, కొమరంభీం పేర్లు జిల్లాలకు పెట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా టీఆర్ఎస్ కు కుసంస్కారం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.  
 
ప్రాజెక్టుల విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత ప్రాజెక్టుపై రాహుల్‌ గాంధీ పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.17వేల కోట్ల నుంచి 40 వేల కోట్లకు పెంచారని గుర్తు చేశారు. 

ప్రాణహిత, కాళేశ్వరం ఖర్చు రూ.80 వేల కోట్లని సీడబ్లూసీనే చెప్పిందన్నారు. 2013 భూసేకరణ చట్టం తర్వాత పరిహారం పెరిగిందని కొత్త ప్రాజెక్టుల కారణంగా ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగిందన్నారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టుకు అంబేడ్కర్‌ పేరు ఉంది అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

మరోవైపు రైతుల ఆత్మహత్యలపై రాహుల్‌ గాంధీ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ అసమర్ధతతోనే ఈ సమస్యలు వచ్చాయని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుతున్నాయని కేంద్రమే చెప్పిందన్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చనిపోయినవాళ్ల పేర్లతో కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో 25 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, టీఆర్‌ఎస్‌ హయాంలో పాలమూరు పచ్చగా మారుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. 
 
రైతులకు విద్యుత్‌, సాగునీరు, పెట్టుబడి సాయం అందజేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కర్ణాటకలో రుణమాఫీపై రాహుల్ అవాస్తవాలు చెప్పారని, రుణమాఫీపై తెలంగాణ విధానాన్నే కర్ణాటకలో అమలుచేస్తున్నారని చెప్పారు. లక్షా 9వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందన్నారు. 

ఇప్పటికే 32వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మరో 27వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చామని తెలిపారు. మిగతా ఉద్యోగాల భర్తీపై కోర్టుల్లో కాంగ్రెస్‌ నేతలు కేసులు వేశారన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ముల్కీ రూల్స్‌ను తుంగలో తొక్కారని కేటీఆర్‌ ఆరోపించారు. 

రాహుల్ ప్రసంగంలో చాలా వరకు అసత్యాలు, అర్థ సత్యాలు ఉన్నాయని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ మోదీకి దగ్గరంటూ మాట్లాడటం బాధాకరమన్న కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ ఒకే తాను మెుక్కలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మైనార్టీ మెజారిటీ అనేది ఎప్పుడూ లేదన్నారు. 

మరోవైపు రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానమో మూడో స్థానమో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అని కేటీఆర్ అన్నారు. ఇకపోతే అటు బీజేపీ రాబోయే ఎన్నికల్లో వంద సీట్లలో డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. 

నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కన్నీళ్లను స్వయంగా చూసిన కేసీఆర్‌ తెలంగాణ ఏర్పడ్డాక సాగునీరు, తాగునీటిని ప్రజలకు శరవేగంగా అందించాలనే ఉద్దేశంతో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో తప్పిదాలను సవరించే క్రమంలో విశ్రాంత ఇంజినీర్లు, మేధావులను సంప్రదించారని వివరించారు. అంతే తప్ప తాము అంబేడ్కర్‌ పేరును తొలగించలేదన్నారు. మహనీయులను గౌరవించుకొనే సంస్కారం తమకుందన్నారు. ఎవరు పడితే వారు ఇచ్చిన స్క్రిప్ట్‌లను ఎటుబడితే అటు చదివితే ఇలాంటి ఇబ్బందులే వస్తాయని ఎద్దేవా చేశారు.  

60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌కు బీడీ కార్మికులు, గల్ఫ్‌ బాధితులు ఎందుకు గుర్తు రాలేదని నిలదీశారు. ప్రాజెక్టులపై కేసులు వేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నది కాంగ్రెస్‌ నేతలేనని  కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం 6గంటల విద్యుత్‌ కూడా ఇవ్వలేదని, రైతులకు అవసరమైన నీరు, విద్యుత్‌, పెట్టుబడి ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios