అర్వింద్‌ది ఫేక్ డిగ్రీ.. సంజయ్, రేవంత్‌లు ఒక్కసారైనా పరీక్ష రాశారా : పేపర్ లీక్ ఆరోపణలపై కేటీఆర్ కౌంటర్
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వంపై చేసిన విమర్శలకు గాను మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. ఎంపీ అర్వింద్‌ది ఫేక్ డిగ్రీ అని.. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా అని ఆయన ప్రశ్నించారు.
ఒకప్పుడు కరువు, మెట్ట పంటలతో వున్న సిరిసిల్ల నేడు కోనసీమలాగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగిస్తూ.. పదవులు వున్నప్పుడు ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు. మోడీ 15 లక్షలు ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయారని కేటీఆర్ చురకలంటించారు. పార్టీ కార్యకర్తలు లేకుండా తాము లేమని.. పదవులు వస్తుంటాయి, పోతుంటాయని మంత్రి పేర్కొన్నారు. డైలాగులు కొట్టుడు సులభం, కానీ పనిచేయడమే కష్టమన్నారు. ఫేక్‌డు గాళ్లు, జోకుడు గాళ్లు ఏదేదో చెబుతారని.. తెలంగాణ గ్రామాలు అభివృద్ధిలో పోటీపడుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ పథకాలు లేవని.. సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. విద్యార్ధులు ఎవరి మీద కొట్లాడాలని మంత్రి ప్రశ్నించారు. కరీంనగర్‌కు ఏం చేశావో చెప్పు అని బండి సంజయ్‌ని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎంను పట్టుకుని బండి సంజయ్ బ్రోకర్ అంటున్నాడని.. ప్రధాని మోడీ బ్రోకర్ అని తాను అనలేనా అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ తనకు సంస్కారం వుందని, తాను అననని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన బీఎల్ సంతోష్ బ్రోకర్ కాదా అని మంత్రి ప్రశ్నించారు.
తాను పేపర్ లీక్ చేసి అమ్ముకుని బతుకుతున్నానట అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవితంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు ఎప్పుడైనా ఒక్క పరీక్ష రాశారా అని ఆయన ప్రశ్నించారు. ఎంపీ అరవింద్‌ది ఫేక్ డిగ్రీ అని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణను శత్రు దేశంగా చూస్తున్నారని.. తెలంగాణ పుట్టుకను అవమానించింది ప్రధాని కాదా అని ఆయన నిలదీశారు. గుజరాత్ గులాంల చెప్పుల మోసే బండి సంజయ్ తెలంగాణలో పుట్టడం దురదృష్టకరమన్నారు. ప్రధాని మోడీ తన దోస్తులకు దోచి పెడుతున్నారని.. అదానీ ఇచ్చే చందాల కోసం మోడీ దిగజారుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఒక్కటే బతికుండాలె, అన్ని పార్టీలను చంపేయాలన్నదే మోడీ ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. పోతారంలో గ్రూప్ 1 పాస్ అయ్యింది ముగ్గురేనని మంత్రి తెలిపారు.