హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొంది.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎం  కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

ఈ తీర్మానంపై కేసీఆర్ ప్రసంగం పూర్తైన తర్వాత అన్ని పార్టీల సభ్యులను మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సభలో ఆయా పార్టీ సభ్యుల సంఖ్య ప్రకారంగా సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన సభ్యులు కూడ సమయాన్ని పాటించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.

పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్కకు కేటాయించిన నిర్ణీత సమయంలో తన ప్రసంగాన్ని పూర్తి చేయకపోవడంతో మంత్రి కేటీఆర్ ను ప్రసంగించాలని స్పీకర్ కోరారు.

also read:పీవీకి భారతరత్న ఇవ్వాలి: అసెంబ్లీలో తీర్మానం పెట్టిన కేసీఆర్

మంత్రి కేటీఆర్ ప్రసంగించిన తర్వాత భట్టి విక్రమార్కను మాట్లాడేందుకు స్పీకర్ అనుమతిచ్చారు. అయితే నిర్ణీత సమయంలోనే ప్రసంగాన్ని పూర్తి చేయాలని పదే పదే చెప్పారు.

ఈ విషయమై తమను అవమానపర్చేవిధంగా మాట్లాడడం సరైంది కాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తన ప్రసంగాన్ని త్వరగానే పూర్తి చేస్తానని చెప్పారు. అయితే  ఈ సమయంలో మల్లు భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాధ్యక్ష స్థానాన్ని కించపర్చేలా  చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆ తర్వాత భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని కొనసాగించాడు. కానీ తన ప్రసంగాన్ని పూర్తి చేయకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ప్రసంగించాలని స్పీకర్ కోరారు. ఈ విషయమై తన ప్రసంగాన్ని పూర్తి చేసే అవకాశం ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరారు. ఈ సమయంలో ఇప్పటికే కేటాయించిన సమయం కంటే అధిక సమయం తీసుకొన్నారని భట్టిని ఉద్దేశించి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఎట్టకేలకు స్పీకర్ సూచన మేరకు భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.  ఆ తర్వాత  టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ విషయమై ప్రసంగించారు.