హైదరాబాద్: ప్రజాకూటమిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మహాకూటమి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్టణంలో కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మహాకూటమి అధికారంలోకి వస్తే రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. 

పాలమూరుపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారని విమర్శించారు .రైతులెవరూ కుంట భూమిని కూడా అమ్ముకోవద్దని సూచించారు. తెలంగాణలో టీడీపీకి క్యాడర్ లేదని..కాంగ్రెస్ కు లీడర్లు లేరని కేటీఆర్ విమర్శించారు. 60ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏనాడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.

ప్రజాకూటమి సీఎం అభ్యర్థి ఎవరో ఇప్పటికీ ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. కూటమిలో అందరూ సీఎం అభ్యర్థులేనని వ్యగ్యంగా విమర్శించారు. మహాకూటమి వస్తే నెలకొకరు సీఎంగా ఉంటారని ఏ పదవి కావాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. సీల్డ్  కవర్ ముఖ్యమంత్రి కావాలో, సింహంలాంటి సీఎం కేసీఆర్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని కోరారు. మహాకూటమిలో సీట్లు పంచుకునేలోపు మనం స్వీట్లు పంచుకుంటామని కేటీఆర్ చెప్పారు. 

మరోవైపు ఫార్మాసిటీపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని ఇబ్రహీంపట్నంలో నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు.     ఫార్మాసిటీతో యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. 330 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌రోడ్డు అభివృద్ధి చేయబోతున్నామన్నారు. అలాగే రైతులకు లక్షరూపాయలు రుణమాఫీ చేస్తామని, ఎకరానికి రూ.10వేలు చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ఆసరా పెన్షన్‌లు రూ.2016కు పెంచినట్లు కేటీఆర్ తెలిపారు.