సీఎం కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యూహకర్తలతో కలిసివచ్చేది కొంచమేనన్నారు. పీకేను మించిన వ్యూహకర్త కేసీఆర్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.
జాతీయ రాజకీయాలు, సీఎం కేసీఆర్‌తో (kcr) ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (prashant kishor) భేటీ, థర్డ్ ఫ్రంట్, రాష్ట్రంలో బీజేపీ దూకుడు వంటి అంశాలపై టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ ‘‘ఎన్టీవీ’’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. 14 మంది జాతీయ నేతల కంటే ముందే మతోన్మాదంపై కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. ఎన్నికల వ్యూహకర్తలు సీఎంలను తీసి పెట్టలేరని కేటీఆర్ అన్నారు. రాజకీయ వ్యూహకర్తలతో కలిసివచ్చేది కొంచమేనని.. ప్రశాంత్ కిశోర్ ఆకాశం నుంచి ఏదో తీసుకొస్తారన్న నమ్మకం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిశోర్‌ని మించిన వ్యూహకర్త కేసీఆర్ అని కేటీఆర్ ప్రశంసించారు.
2006-14 తెలంగాణ ఉద్యమ కాలం సంతృప్తినిచ్చిందని కేటీఆర్ అన్నారు. రైతు బంధును కేంద్రం కాపీ కొట్టిందని.. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ తనదైన ముద్ర వేసిందని మంత్రి తెలిపారు. కేసీఆర్ ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో వున్నారని.. త్వరలో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీలో జాతీయ రాజకీయాలపై తీర్మానం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్‌తోనే (congress) ఫ్రంట్ వుండాలన్న ఏకాభిప్రాయం లేదని.. కేసీఆర్‌తో జాతీయ నేతలు కలిసి రావడం లేదన్నది వాస్తవమన్నారు. కాంగ్రెస్ బలహీనతే బీజేపీ బలమని.. పీకే వచ్చి తలకిందులు చేయలేరని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారని.. తాము తలచుకుంటే ప్రతిపక్షనేతలు బయట వుండరని మంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్‌లోని వాళ్లే పక్కచూపులు చూస్తున్నారని.. రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీలోనే ఓడిపోయారని కేటీఆర్ గుర్తుచేశారు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారని.. ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర వైఖరిని ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. తాము విపక్షాలపై ఏసీబీని ప్రయోగించడం లేదని.. దేశంలో మోడీ రాజ్యాంగమే నడవాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. మోడీ చెప్పేవి గాంధీ సూక్తులు.. చేసేవి గాడ్సే పనులంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ, ఈడీలకు తాము భయపడమని.. కేసీఆర్ హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలు చేస్తారని కేటీఆర్ వెల్లడించారు.
కేంద్రంతో పాటు అందరితో ఫ్రెండ్లీగానే వున్నామని.. కానీ కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా అని కేటీఆర్ తెలిపారు. కేంద్రం వివక్షను బయటపెట్టకపోతే తప్పు చేసినవాళ్లం అవుతామని మంత్రి వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో కలిసి పోటీ చేయలేదని.. 7 సీట్లు ఎందుకు పరిమితం చేశారని అనుకోవద్దన్నారు. సాధారణ మెజార్టీ కంటే 45 మంది ఎక్కువే వున్నారని.. ప్రభుత్వానికి బీజేపీ మద్ధతు ఇచ్చినా తీసుకుంటామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో బీజేపీ ఒక్క కౌన్సిలర్ సీటునైనా గెలిచిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. విద్యార్ధుల్ని రెచ్చగొట్టి బీజేపీ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని మంత్రి ఆరోపించారు. మేనిఫెస్టోలో చెప్పిన 99 హామీలు నెరవేర్చామని.. మోడీ ఒక్క హామీనైనా నెరవేర్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు.
