Asianet News TeluguAsianet News Telugu

బాసర ట్రిపుల్ ఐటీ‌పై కేటీఆర్ వరాల జల్లు.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పిన మంత్రి..

రాష్ట్రంలోని ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

Minister KTR Comments In Basara IIIT
Author
First Published Dec 10, 2022, 4:02 PM IST

రాష్ట్రంలోని ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో శనివారం జరిగిన ఐదో స్నాతోకత్సవానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫాంలను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు, విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామని చెప్పారు. పీ1, పీ2లో 1500 మంది విద్యార్థుకు డెస్క్‌టాప్‌లు అందిస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ముఖ్యమని చెప్పారు. టీహబ్‌తో బాసర ట్రిపుల్‌ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని అన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ కీలక పాత్రపోషిస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంతో పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే ఆపగలిగేవారు ఉండరని చెప్పారు. తెలంగాణ విద్యాసంస్థలతో ప్రపంచ స్థాయి సంస్థలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని తెలిపారు. 

అలాగే.. బాసర ట్రిపుల్ ఐటీలో సైన్స్ బ్లాక్ ఏర్పాటుకు రూ. 5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. యూనివర్సిటీలో ఉన్న చెరువును సుందరీకరిస్తామని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా రక్షిత మంచినీళ్లు క్యాంపస్‌కు రావాలని అన్నారు. వెంటపడి పనులు పూర్తి చేయించే బాధ్యత తనదని  చెప్పారు. ట్రిపుల్ ఐటీకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పారు. 

ఇక, బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటించిన సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతి, విద్యార్థుల అకాడమిక్ పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు, ఉపాధి, ఉన్నత విద్యావకాశాల కల్పనపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో తాను బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటించిన సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. 

అయితే మెస్ కాంట్రాక్ట్‌ మార్పు విషయంలో అధికారులు ఇచ్చిన సమాధానంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించడానికి టెండర్లు పిలవడం అంతరిక్ష సమస్యనా అని ప్రశ్నించారు ఎవరైనా ఓవర్‌యాక్షన్ చేస్తే పోలీసులు సాయం తీసుకోవాలని సూచించారు. పిల్లల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకుండా నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. మిగిలిన విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ ఎప్పటిలోగా అవుతుందని అడిగి తెలుసుకున్నారు. ఆడిటోరియంలో సిట్టింగ్‌కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే సిట్టింగ్‌ను మార్చినట్టుగా అధికారులు మంత్రులకు తెలియజేశారు. ఇక, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కొత్త అడ్మిన్ బ్లాక్‌కు సంబంధించి అప్రూవల్స్‌పై వివరాలు అడిగి తెలసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios