Asianet News TeluguAsianet News Telugu

ఎల్బీ నగర్‌ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు.. మెట్రోను ఎయిర్‌పోర్టు వరకు తీసుకెళ్తాం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ఎల్‌బీ నగర్ జంక్షన్‌లో ఆర్‌హెచ్‌ఎస్‌ ఫ్లై ఓవర్‌ను శనివారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్‌ను 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. 

Minister KTR Comments At LB Nagar RHS flyover inauguration Program
Author
First Published Mar 25, 2023, 5:59 PM IST

హైదరాబాద్ ఎల్‌బీ నగర్ జంక్షన్‌లో ఆర్‌హెచ్‌ఎస్‌ ఫ్లై ఓవర్‌ను శనివారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్‌ను 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. రూ. 32 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. ఫ్లై ఓవర్‌ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్సార్‌డీపీలో భాగంగా ఎల్‌బీ నగర్‌లోనే 12 ప్రాజెక్టులు చేపట్టినట్టుగా తెలిపారు. ఈరోజు 9వ ప్రాజెక్టును ప్రారంభించినట్టుగా చెప్పారు. మిగతా మూడు ప్రాజెక్టులను కూడా సెప్టెంబర్‌లోపు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఫ్లై ఓవర్‌లు పూర్తికావడంతో.. ఎల్‌బీ నగర్ చౌరస్తా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తయారైందని చాలా మంది చెబుతుందని అన్నారు. అయితే ప్రజా రవాణా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నాగోల్‌ మెట్రోను ఎల్బీ నగర్‌కు జోడిస్తామని చెప్పారు. అలాగే మెట్రోను హయత్‌నగర్‌ వరకు విస్తరిస్తామని తెలిపారు. ఎల్‌బీ నగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను తీసుకెళ్తామని.. వచ్చే టర్మ్‌లో ఆ పనిని పూర్తి చేస్తామని చెప్పారు. వెయ్యి పడకలతో గడ్డి అన్నారంలో నిర్మిస్తున్న టిమ్స్‌ను ఏడాదిన్నర కాలంలో పూర్తిచేసి అందుబాటులో తీసుకోస్తామని చెప్పారు. దీర్ఘకాలికంగా అపరిషృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. 

భారీ వర్షాలు పడినప్పుడు ఎల్‌బీ నగర్‌లో పర్యటించిన సమయంలో మాట ఇచ్చినట్టుగా ఎస్‌ఎన్‌డీపీ(స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్) ప్రారంభించామని తెలిపారు. ఇందులో కొన్ని పనులు పూర్తయాయని.. మరొ కొన్ని పూర్తి కావాల్సి ఉందన్నారు. రాబోయే వర్షకాలం లోపు రూ. 985 కోట్లతో చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమాలను పూర్తి చేస్తామని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు కోరిక మేరకు.. ఎల్‌బీ నగర్‌ చౌరస్తాకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరును, ఈ ఫ్లై ఓవర్‌కు మాల్-మైసమ్మ పేరును పెట్టనున్నట్టుగా తెలిపారు. ఎల్‌బీ నగర్‌ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతూ తగిన ఆదేశాలు జారీచేస్తామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios