లాస్య నందిత ఇచ్చిన హామీలను అమలు చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

లాస్య నందిత మరణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతదేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని వివరించారు. కంటోన్మెంట్‌లో ఆమె ఇచ్చిన హామీలను తాము పూర్తి చేస్తామని తెలిపారు.
 

minister komatireddy venkatreddy says will fulfill lasya nandita promises kms

LasyaNandita: కంటోన్మెంట్ ఎమ్మెల్యే, దివంగత రాజకీయ నాయకుడు సాయన్న కూతురు లాస్య నందిత మరణం కలకలం రేపింది. ఆమె మరణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఆమె మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయన్న మరణించిన ఏడాదిలోనే ఆయన బాటలో నడుస్తున్న లాస్య నందిత మరణించడం బాధాకరం అని అన్నారు. సాయన్నతో తనకు వ్యక్తిగతంగా సంత్సంబంధాలు ఉండేవని వివరించారు. తాము 15 ఏళ్లు కలిసి శాసన సభకు వెళ్లామని తెలిపారు. సాయన్న తరహాలోనే లాస్య నందిత కూడా ప్రజలతో కలుపుగోలుగా మెలుగుతున్నారని, అనతి కాలంలోనే ప్రజల్లోకి వెళ్లారని అన్నారు. కానీ, ప్రజలు ఎన్నుకున్న సాయన్న మరణించిన ఏడాది రోజుల తర్వాత ప్రజల ద్వారా ఎన్నికైన లాస్య నందిత మరణించడం కలచివేసిందని వివరించారు.

ఆమె గుడికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు ఏసీపీ చెప్పారని పేర్కొన్నారు. ఆకలి వేయడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై ఏదైనా హోటల్ ఉంటే తినడానికి వెళ్లారని, రోడ్డు క్రాస్ చేస్తుండగా పక్కనే ఉన్న ఓ లారీ వారి కారుకు తగలడంతో అటు వైపుగా వెళ్లి రేలింగ్‌ను కారు ఢీకొన్నట్టు చెప్పారు. ఆమె కారులో ముందు సీటులో కూర్చున్నట్టు ఉన్నారని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో బలమైన గాయాలు తగిలాయని తెలిపారు. 

Also Read: Lok Sabha Elections: మార్చి 13 తర్వాత ఎన్నికల షెడ్యూల్!.. ఈసీ వర్గాల వెల్లడి

అందుకే ఎవరైనా సరే.. సీటు బెల్టు ధరించాలని సూచించారు. అలాగే.. ఆమె ఈ రోజు కూడా కంటోన్మెంట్‌లో రకరకాల పనులు పెట్టుకున్నట్టు చెప్పారు. ప్రజా సంబంధ కార్యకలాపాలు పెండింగ్‌లో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారని వివరించారు. లాస్య నందిత మరణంపై సీఎం రేవంత్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, ఆమె మృతదేహానికి అధికారిక లాంఛనాలతో అంతిమ క్రియలు నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అంతేకాదు.. లాస్య నందిత కంటోన్మెంట్ అభివృద్ధికి ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios