అధికార పార్టీ పెద్దలు తమ పాలన ఆహా.. ఓహో.. అని రాజధాని హైదరాబాద్ లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. పత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో యాడ్స్ వేస్తున్నారు. కానీ అధికార టిఆర్ఎస్ పార్టీలోనే కిందిస్థాయి ప్రజా ప్రతినిధులు సర్కారుపై రగలిపోతున్నారనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ. మాటలు తప్ప చేతలు లేవని జడ్పీటీసీలు సర్కారుపై గుర్రుగా ఉన్నారు. దీంతో పాలమూరు ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ సమావేశానికి అధికార పార్టీ జెడ్పీటీసీలే గైర్హాజరయ్యారు. అంతిమంగా జిల్లా మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు చుక్కలు చూపించారు. వివరాలు చదవండి.

ఉమ్మడి పాలమూరు జిల్లా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.. ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులతోపాటు అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీలు తమ నిరసన తెలపడానికి ఏకంగా జడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తెర వెనుక మంత్రాంగం నడిపినా ఫలితం ఇవ్వలేదు. తమకు నిధుల కేటాయింపులో జరుగుతున్న చిన్నచూపుపై జడ్పీ సమావేశానికి గైర్హాజరై కొత్త చర్చకు దారి తీశారు. దీంతో మంత్రి, జడ్పీ ఛైర్మన్‌, ఎమ్మెల్యేలు కోరం కోసం కావాల్న సభ్యులను బతిమిలాడి పిలిపించుకుని తూతూమంత్రంగా జడ్పీ సమావేశాన్ని నిర్వహించి ముగించారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన జడ్పీ సమావేశం కోరం లేక ఒకసారి వాయిదా పడింది. కోరం సరిపడా సభ్యులు లేకపోవడంతో మధ్యామ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. ఈలోగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కొంతమంది జడ్పీటీసీలకు ఫోన్లు చేసి బతిలాడి సమావేశానికి పిలిపించడంతో కోరం నిండింది. సమావేశం మొదలైంది. తూ.తూ.మంత్రంగా సమావేశం జరిపి ఊపిరి పీల్చుకున్నారు అధికార పార్టీ నేతలు. 64 మంది జడ్పీటీసీల్లో అధికార టిఆర్ఎస్ కు 53 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్‌కు 9 మంది, బిజెపికి ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున 26 మంది సభ్యులే గెలిచినా కాంగ్రెస్‌, టిడిపి ల నుంచి 27 మంది సభ్యులు ఆ పార్టీలో చేరారు. ప్రస్తుతం జడ్పీలో అధికార పార్టీ సభ్యులే ఎక్కువున్నా నిధుల కేటాయింపుపై నిరాశతో ఉన్నారు.

గత కొన్ని రోజుల్లో అంతర్గత చర్చల ద్వారా సమావేశానికి గైర్హాజరై తమ సత్తా చాటాలని భావించారు. మొదట జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 20న నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే కొందరు జడ్పీటీసీ సభ్యులు రహస్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయం తీసుకున్నారని తెలియడంతో సభను వాయిదా వేశారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉమామహేశ్వర ఆలయం వద్ద కూడా ఓ వర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నిధుల కేటాయింపుపై మాట్లాడుకున్నారు. దీంతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి బుజ్జగించినా చివరకు అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా మెజార్జీ సభ్యులు సమావేశానికి గైర్హాజరై సొంత శాఖ మంత్రి జూపల్లికే షాక్ ఇచ్చారు. తుదకు ఫోన్లు చేసి బతిలాడి కొంతమందిని మాత్రం రప్పించుకుని సమావేశం నడిపిన దాఖలాలు ఉన్నాయి.