Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో ఓడిపోయామనే తెలంగాణపై అక్కసు : మోడీపై జగదీశ్ రెడ్డి ఫైర్

మునుగోడులో ఓడిపోయామని అక్కసును ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లగక్కారని అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ నాయకత్వంలో మరింత ముందుకు వెళ్తామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. 

minister jagadish reddy slams pm narendra modi over his remarks on telangana
Author
First Published Nov 12, 2022, 7:27 PM IST

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై మండిపడ్డారు మంత్రి జగదీశ్ రెడ్డి. సీఎం కేసీఆర్‌పై విషం చిమ్మేలా మోడీ మాట్లాడారని మంత్రి ఫైరయ్యారు. మునుగోడులో ఓడిపోయామని అక్కసును ప్రధాని వెళ్లగక్కారని.. వడ్డీతో సహా ఇస్తారన్న మీకే ప్రజలు తిరిగి చెల్లిస్తారని జగదీశ్ రెడ్డి జోస్యం చెప్పారు. బ్యాంకుల నుంచి రుణాలు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో అలజడి రేపేందుకు కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. మోసపోవడానికి తెలంగాణ ప్రజలు ..గుజారాత్ వాసుల్లాంటి వారు కాదని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై విషం కక్కినప్పటికీ.. హంసల్లాంటి తెలంగాణ ప్రజలు విషాన్ని కూడా వేరు చేస్తారని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ నాయకత్వంలో మరింత ముందుకు వెళ్తామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. 

అంతకుముందు రామగుండంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తున్నామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదని మెజార్టీ వాటా రాష్ట్రానిది అయితే కేంద్రం ఎలా విక్రయిస్తుందని మోడీ ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని ప్రధాని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్ట్‌లతో జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు ప్రధాని . 

ప్రపంచంలోనే మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్నారు. ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వేలైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు కలుగుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభించాయన్నారు. 8 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని తెలిపారు. అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచామని.. తాము శంకుస్థాపనలకే పరిమితం కాలేదని, వాటిని వేగంగా పూర్తి చేసి చూపించాలమని మోడీ పేర్కొన్నారు.

ALso Read:సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిదే.. మేం ఎలా ప్రైవేటీకరణ చేస్తాం : మోడీ

రామగుండం ఎరువుల కర్మాగారానికి 2016లో శంకుస్థాపన చేశామని.. రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు. యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని.. తక్కువ ధరకే నీమ్ కోటింగ్ యూరియాను అందిస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు అందిస్తున్నామని.. నేల స్వభావాన్ని బట్టి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు చేపట్టామని ప్రధాని పేర్కొన్నారు. 

5 ప్రాంతాల్లోని ఎరువుల కర్మాగారాల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి  జరుగుతోందన్నారు. నానో యూరియా టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తెచ్చామన్న ఆయన... 2014 కంటే ముందు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవాళ్లని ప్రధాని వెల్లడించారు. తాము తీసుకున్న చర్యలతో యూరియా నల్లబజారు మార్కెట్ బంద్ అయ్యిందన్నారు. భవిష్యత్‌లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందని ప్రధాని చెప్పారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, నకిలీ లేకుండా చర్యలు తీసుకున్నామని.. ఖమ్మం జిల్లాలో మరో రైల్వే లైన్‌ను ప్రారంభించామని మోడీ తెలిపారు. కొత్త రైల్వే లైన్‌తో ప్రజలకు , విద్యుత్ రంగానికి ప్రయోజనమన్నారు. కొత్తగా చేపడుతున్న హైవేల విస్తరణ వల్ల ఎన్నో మార్పులు రానున్నాయని.. సింగరేణి విషయంలో కొందరు అబద్దాలు చెబుతున్నారని మోడీ ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios