Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డిని చూసి జానా.. ఉత్తమ్ భయపడలేదా?

  • సంస్మరణ పేరుతో సంస్కార రహిత సభ
  • టీఆర్‌ఎస్ నేతల శవాలను మోరీలో వేస్తరా?
  • ఇది మనుషులు మాట్లాడే భాషేనా?
  • జైపాల్, జానా సమాధానం చెప్పాలి
  • అంతర్గత గొడవలతోనే బొడ్డుపల్లి హత్య
minister jagadish reddy fire on komatireddy and congress leaders

కోమటిరెడ్డిని చూసి జానారెడ్డి, ఉత్తమ్ భయపడలేదా?

నిన్నటివరకు నల్లగొండకు రావడానికి జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ భయపడింది నిజంకాదా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. 20 ఏండ్లు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి నల్లగొండ నియోజకవర్గంలో ఒక్క శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమమైనా చేశారా? ఉత్తమ్ మంత్రిగా నల్లగొండలో అడుగు పెట్టగలిగినవా? పీసీసీ చీఫ్‌గా నల్లగొండలో ప్రెస్‌మీట్ పెట్టగలిగినవా? ఎవరికి భయపడి రాలేదు? సమాధానం చెప్పాలి అన్నారు. సీనియర్ నేతలనే భయపెట్టినవాళ్లు సాధారణ ప్రజలను, ఇతర పార్టీల కార్యకర్తలను ఏరకంగా భయపెట్టిస్తరో చెప్పక్కర్లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎన్ని శవరాజకీయాలు చేసినా, చిల్లర ఏరుకోవాలని చూసినా సాధ్యంకాదని స్పష్టంచేశారు. ప్రజలకు అన్నీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో ఎవ్వరి బట్టలు విప్పాల్నో నిర్ణయించుకున్నరు. ఆ భయంతోనే కాంగ్రెస్ నాయకులు సభ పెట్టి నీచమైన, నికృష్టమైన మాటలు మాట్లాడారు. మనుషులు మాట్లాడుకోలేని మాటలు మాట్లాడుతున్నరు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రక్త చరిత రాసిందంతా కాంగ్రెస్ పార్టీయే అని విమర్శించారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య.. తదనంతర పరిణామాలపై జగదీష్ రెడ్డి మీడియాకు సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కి ఉన్న రక్త చరిత టిఆర్ఎస్ కు లేదన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల మొండాలు మోరీల్లో తేల్తయ్. ఎమ్మెల్యేలను, మంత్రులను బట్టలూడదీసి కొడ్తం. ఎమ్మెల్యేలను ఎన్‌కౌంటర్ చెయ్యాలె ఇవీ నల్లగొండలో నిర్వహించిన బొడ్డుపల్లి శ్రీనివాస్ సంస్మరణ సభలో కాంగ్రెస్ నాయకులు ప్రజలకిచ్చిన సందేశాలు. ఇది సంస్మరణ సభా? సంస్కారహీనుల సభా? సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి సమాధానం చెప్పాలె అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య విషయంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చంపడాలు, చంపించడాలు, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కుట్రలు, కుతంత్రాలు చేయడాలు ఇవన్నీ కాంగ్రెస్ సంస్కృతి అని అన్నారు.

కాంగ్రెస్ అంతర్గత గొడవలతోనే నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చరిత్ర హత్యలు, దాడుల రాజకీయాలమయమని విమర్శించారు. వారిలో వారే గ్రూపులు కడుతూ ఆధిపత్య రాజకీయాలతో ఏనాడూ అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. శ్రీనివాస్ హత్య విషయంలో కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని ఖండించారు. చంపడాలు, చంపించడాలు, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కుట్రలు కుతంత్రాలు చేయడాలు కాంగ్రెస్ సంస్కృతి అన్నారు. బొడ్డుపల్లి హత్య విచారకరమని చెప్పారు. ఈ హత్యతో టీఆర్‌ఎస్‌కు సంబంధంలేదని స్పష్టంచేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఇతర కాంగ్రెస్ నాయకులు అత్యంత నీచస్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని, శ్రీనివాస్ హత్యనుంచి రాజకీయ లబ్ధిపొందాలని హేయమైన నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మా నాయకుడు కేసీఆర్ అందరినీ కలుపుకొనిపొండి. అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోండి. ప్రతిపక్ష నాయకులతోనూ మర్యాదగా మసులుకోండి అని చెప్తారు.

జైపాల్, జానారెడ్డి వారి నాయకులకు ఏం చెప్తున్నారు? అని ప్రశ్నించారు. వారి పార్టీ అంతర్గత ఘర్షణ కారణంగా జరిగిన ఘటనను అడ్డంపెట్టుకొని, సంస్మరణ సభ పేరుతో సంస్కారరహిత సభను కాంగ్రెస్ నిర్వహించింది అని విమర్శించారు. అబద్ధాలతోనే రోజును ప్రారంభించి,అబద్ధాలతోనే రోజును ముగించే కోమటిరెడ్డి సోదరుల గురించి మాట్లాడటమే సరికాదని వ్యాఖ్యానించారు. చాలా విజ్ఞులమని, మేధావులమని చెప్పుకునే జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, కుంతియాలు కాంగ్రెస్ నేతల భాషకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. హత్య జరిగిన తెల్లవారి 10 గంటల వరకు శ్రీను భార్య వాస్తవాలే చెప్పారు. ఆ తర్వాతే వెంకటరెడ్డి డ్రామా మొదలుపెట్టారు. హత్య జరిగిన వెంటనే పోలీసులు, టీఆర్‌ఎస్‌పై నిందలేశారంటే ఈ ఘటన కచ్చితంగా కాంగ్రెస్ అంతర్గత తగాదాలతోనే జరిగిందని స్పష్టమవుతున్నది అని అన్నారు.

గతంలోనే బొడ్డుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరిండు. మళ్లీ పార్టీ విడిచి వెళ్లిపోయాడు. చేరనందుకే ఇలా చేశారనడం నీచమైన, దరిద్రమైన మాట. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేకమంది ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 12 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలూ టీఆర్‌ఎస్సే గెలుస్తుందని కాంగ్రెస్ నేతలకు తెలుసు. అందుకే విమర్శలు చేస్తున్నరు అన్నారు. గతంలో వందల రాజకీయ హత్యలతో జిల్లా నాశనమైంది. ఊళ్లల్లో గోరీలు, స్థూపాలు తప్ప అభివృద్ధి జాడలు కనిపించలేదు. కానీ మూడున్నరేండ్లుగా ఏ చిన్న రాజకీయ తగాదా జరుగకుండా ఎలా పారదర్శక పాలన జరిగిందో ప్రజలు చూస్తున్నరు. ఒక్క నల్లగొండలో మంత్రి, అధికారులు లేకుండా తాళాలు పగులకొట్టి శంకుస్థాపనచేస్తా అంటూ స్థానిక ఎమ్మెల్యే చేసిన చిల్లర ఘటన తప్ప ఎలాంటి గొడవల్లేవు అని చెప్పారు.

జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, కుంతియా వేదికపై ఉండగానే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ కార్యకర్తల శవాలు మోరీలో పెడుతమని, మరో నాయకుడు బట్టలూడదీసి కొడుతమని మాట్లాడిన భాష మేము మాట్లాడం. మాకు శవాలను మోరీలో వేసే శక్తి కూడా లేదు. కాంగ్రెస్ నేతలకే ఆ శక్తి ఉంది. మీ కార్యకర్తలను మీరే చంపుకొని మోరీలో వేయగలరు. మీకు ఆ సంస్కృతి ఉంది కాబట్టే, అలవాటు కాబట్టే అలాంటి విమర్శలు చేస్తున్నరు అని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవాళే ఇలా మాట్లాడుతున్నరంటే.. అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అరాచకాలెన్నని ప్రశ్నించారు. వెంకటరెడ్డి అరాచకాల గురించి నల్లగొండలో ఎవరినడిగినా చెప్తరు. ఆయన అనుచరులు ఏ రకంగా దందాలు చేస్తరో, ప్లాట్లను ఆక్రమిస్తరో వివరిస్తరు అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios