Asianet News TeluguAsianet News Telugu

రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యాలయంగా మార్చారు.. : గవర్నర్ తమిళిసై పై మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు

Hyderabad: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యాలయంగా మార్చారని ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ అధిష్టానం ఆదేశానుసారం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిందని గవర్నర్‌ వ్యవహరిస్తున్న తీరు తెలుస్తోందని అన్నారు.
 

Minister Jagadish Reddy criticises Governor Tamilisai for turning Raj Bhavan into BJP office
Author
First Published Nov 15, 2022, 12:31 PM IST

Tamilisai-Jagadish Reddy: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చారని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ తన నివాసాన్ని బీజేపీ పార్టీ కార్యాలయంగా మార్చారని ఆరోపించారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్‌పిడిసిఎల్)లో పనిచేయడానికి ఎంపికైన 69 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 178 మంది సబ్ ఇంజనీర్లకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందజేసిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీని టార్గెట్ చేస్తూ మంత్రి విమర్శలు గుప్పించారు.

బీజేపీ అధిష్టానం ఆదేశానుసారం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిందని గవర్నర్‌ వ్యవహరిస్తున్న తీరు తెలుస్తోందని ఆయన అన్నారు. "ఆమె గవర్నర్‌గా కాకుండా బీజేపీ నాయకురాలిగా ప్రవర్తిస్తున్నారు. రాజ్‌భవన్‌ను బీజేపీ రెండో పార్టీ కార్యాలయంగా మార్చారు. ప్రజలు కూడా ఆమెను గవర్నర్‌గా కాకుండా బీజేపీ నాయకురాలిగా చూస్తున్నారు" అని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన కొన్ని బిల్లులకు గవర్నర్ ఆమోదం ఆలస్యం చేయడంపై వ్యాఖ్యానించిన జగదీశ్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన, రాజ్యాంగపరమైన అవకాశాలను అన్వేషిస్తుందని చెప్పారు.

“గవర్నర్ రాజ్యాంగం ప్రకారం నిర్దేశించిన నిబంధనల ప్రకారం పనిచేయాలి. కానీ దురదృష్టవశాత్తు, ఆమె నిబంధనలను పాటించడం లేదు. మేము బిల్లులను క్లియర్ చేయడానికి మార్గాలను కనుగొంటాము”అని మంత్రి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓడిపోయినా నైతికంగా గెలిచిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ. కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ.. ఓటర్లను, ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ నాయకత్వం అన్ని తంత్రాలను ప్రయోగిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంపై విశ్వాసంతో మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ప్రజలు పట్టం కట్టారని అన్నారు. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలనే ముఖ్యమంత్రి యోచనపై, ఈ నిర్ణయం వల్ల బీజేపీ నాయకత్వం భయాందోళనలకు గురైందనీ, ఆయనను ఎదుర్కోవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తోందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. “సీఎం గుజరాత్‌లో పర్యటించనప్పటికీ, ఆయన సంక్షేమ పథకాలు గుజరాత్ ప్రజలలో ప్రాచుర్యం పొందాయి. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం బీజేపీకి సమస్యగా మారింది, ఎందుకంటే గుజరాత్‌లో ఇలాంటి పథకాలను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు”అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమాలు, పథకాలు దేశ ప్రజలలో ఆదరణ పొందుతున్నందున ఆయన ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

కాగా, గత కొంత కాలంగా రాష్ట్రంలో గవర్నర్, ప్రభుత్వం మధ్య అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నాయకులు, గవర్నర్ మధ్య మాటల యద్దం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తన ఫోన్ లు ట్యాప్ కు గురవుతున్నాయా? అనే అనుమానం కలుగుతున్నదని తమిళిసై సౌందరరాజన్ అన్నారు. టీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్‌లను ట్యాప్ చేస్తుందని భయపడుతున్నానని అన్నారు. అలాగే, తన గోప్యతకు ఆటంకం కలుగుతోందని కూడా ఆమె పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios