బీఆర్ఎస్ బహిరంగ సభ.. నాందేడ్లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నేతలు
ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఫిబ్రవరి 5న మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరనున్నారు.

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జోగు రామన్న, షకీల్ , సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా నేతలకు కీలక పలు సూచనలు చేశారు ఇంద్రకరణ్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు వస్తున్నందున ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 5న మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరనున్నారు.
ఇకపోతే.. బీఆర్ఎస్ బహిరంగ సభకు అక్కడి పోలీసులు అనుమతి లభించింది. బీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత ఇది రెండో బహిరంగ సభ. ఫిబ్రవరి 5న కేసీఆర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్‌లో చేరనున్నారు. జాతీయ రాజకీయాల దృష్టిని మరింతగా ఆకర్షించడం..జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితిని విస్తరించడమే లక్ష్యంగా నాందేడ్ సభ జరగనుంది. ఇటీవల ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ విజయవంతం కావడంతో.. అలాంటిదే మరో సభ రాష్ట్రం వెలుపల చేస్తే... పార్టీలో ఉత్సాహం మరింత పెరుగుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
ALso REad: ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ.. పోలీసుల అనుమతి, కేసీఆర్ సమక్షంలో చేరికలు
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలు నాందేడ్ సభకు అవసరమైన ఏర్పాట్లపై ప్రగతిభవన్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ మేరకు కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నాందేడ్లో జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని.. దీనికి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ బహిరంగ సభను ఈనెల 29వ తేదీన నిర్వహించాలని అనుకున్నారు. అయితే, మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కేసీఆర్ వెనక్కి తగ్గారు.
మహారాష్ట్ర శాసన మండలికి ఎన్నికలు జరుగుతున్నాయి. మండలికి సంబంధించి.. రెండు పట్టభద్రుల, మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 2న ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇవేవీ సభకు అడ్డు రాకూడదన్న కారణంతోనే బిఆర్ఎస్ సభకు ఫిబ్రవరి 5ను ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.