శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందన్నారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్ర సైన్స్ & టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొదటి శాస్త్ర, సాంకేతిక మండలుల సమావేశాలు హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక  పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోందన్నారు.

20 ఏళ్ల సమయం పట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను.. కేసీఆర్ ధృడ సంకల్పంతో, ఆధునిక పరిజ్ఞానం సాయంతో మూడేళ్లలో పూర్తి చేశారన్నారని మంత్రి తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఆన్‌లైన్‌లో నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతమున్న 24 శాతం పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు కేసీఆర్ ప్రణాళిక రూపొందించారని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. ప్రతి దేశం వాతావరణ పరిస్ధితులపై అవగాహణ కలిగించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు.