సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడటం ఖాయమని తెలిసిన తర్వాతే బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కొత్త నాటకానికి తెరతీశారని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇప్పటికే దుబ్బాకలోని బిజెపి శ్రేణులు టీఆర్ఎస్ లోకి భారీగా చేరిపోయారని... దీంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయిన రఘునందన్ కనీసం డిపాజిట్ అయినా కాపాడుకుందామని ప్రయత్నిస్తున్నాడన్నారు. తెలంగాణ బిజెపి ఆత్మరక్షణలో పడిపోయిందన్నారు. రఘునందన్ దొంగ రాజకీయాలు చేస్తున్నాడని... ఆయన ట్రాప్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ పడ్డారని హరీష్ ఆరోపించారు. 

పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ కేవలం ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులనే తనిఖీల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలపైనా మంత్రి స్పదించారు. స్వయంగా మంత్రినయిన తన కారును ఆపి కూడా పోలీసులు తనిఖీలు చేశారన్నారు. అలాగే పలుమార్లు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత కారును ఆపి కూడా తనిఖీ చేశారన్నారు. ఇక సిద్దిపేట మున్సిసల్ ఛైర్మన్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన పోలీసులు బెడ్ ను చింపిమరీ పరిశీలించారని... అయినా కూడా తాము పోలీసులకు సమకరించామే తప్ప ఇలా నానా యాగి చేయలేదని హరీష్ పేర్కొన్నారు. 

బిజెపిపై ఇప్పటికే ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని... అందువల్లే గోబెల్స్ ప్రచారాల ద్వారా సానుభూతి ఓట్లనయినా సాధించాలనే ఈ నాటకాలు ఆడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేయడానికి దాచిన డబ్బులనే రఘునందన్ బంధువు ఇంట్లో పట్టుబడ్డాయని పోలీస్ కమీషనర్ ఇప్పటికే వెల్లడించారన్నారు. అయినా డబ్బులతో రాజకీయాలు చేయడమేంటని హరీష్ ప్రశ్నించారు. 

రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసుల సోదాల విషయం తెలుసుకొని సిద్దిపేటకు వెళ్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలను  పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబ్బాక అసెంబ్లీ  ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు సమీప బంధువుల ఇళ్లలో సోమవారం నాడు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొడవ జరిగింది. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.  

also read:రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో సోదాలు: సిద్దిపేటలో ఉద్రిక్తత

ఈ విషయం తెలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని పోలీసులు సిద్దిపేటకు రాకుండా అడ్డుకొన్నారు. వారిని మార్గమధ్యలోనే అడ్డుకొని కరీంనగర్ కు పోలీసులు తరలించారు. అలాగే పోలీసులు సోదాల విషయం తెలుసుకొన్న రఘునందన్ రావు సిద్దిపేటకు చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు.