Asianet News TeluguAsianet News Telugu

వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయండి: మంత్రి హరీశ్‌రావు

Harish Rao:కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) కేంద్రాన్ని కోరారు. 
   

Minister Harish Rao Wrote A Post Card In The Part Of Peddi Sudarshan Reddys Post Card Movement KRJ
Author
First Published Apr 15, 2023, 4:39 PM IST

Harish Rao:ఉపాధి హామీ ప‌థ‌కాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాల‌ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) కేంద్రాన్ని కోరారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పథకం పై పోస్టు కార్డుల ఉద్యమంలో నేడు మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో మంత్రి హరీష్ రావు కేంద్రానికి లేఖ(పోస్టు కార్డు) రాశారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. గతేడాది 30 వేల కోట్ల బడ్జెట్ కోత విధించారని,  దీంతో ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గాయ‌ని మండిపడ్డారు. వ్యవసాయ కూలికి రోజుకు 257 రూపాయలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ, ఒక్కో కూలికి వంద రూపాయలకు మించడం లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలు పని చేసే చోట కనీస మౌలిక సదుపాయాలు టెంటు, మంచినీరు, గడ్డపారలు, పారలు, తట్టలు వంటివి అందించడం లేద‌ని విమర్శించారు.

కనీస వేతన చట్ట ప్రకారం 8 గంటలు పని చేసిన కూలికి 480 రూపాయలు ఇవ్వాలని ఉన్నప్పటికీ నిబంధనను అమలు చేయడం లేదనీ, ఉపాధి హామీ కూలీలకు మాత్రం కనీస కూలీ ఇవ్వడం లేదని అన్నారు. ఆన్ లైన్ పద్ధతి వల్ల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని,  సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్ లో అప్ లోడ్ చేయాలనే నిబంధనలు పాటించలేకపోతున్నారనీ,  దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని, సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూలీలుగా వారే ఉంటున్నారని తెలిపారు. కాబట్టి ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలనీ, దీని వల్ల రైతులకు కూలీ గిట్టుబాటు అవుతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు నిర్ణీత టోకెన్లు, కనీసం 100 పని దినాలు పని చేసే అవకాశం కల్పించాలని అన్నారు.

అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, ఫీల్డ్ అసిస్టెంట్‌ల నుంచి ఏపీవోల వరకు ఉపాధి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని  మంత్రి డిమాండ్ చేశారు. మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా ఈ నెల 8న నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహమ్మదాపురంలో ఈ పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios