Asianet News TeluguAsianet News Telugu

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఫలించిన హరీష్ రావు వ్యూహం!

టీఆర్‌ఎస్‌ చాలా సిట్టింగ్‌ డివిజన్లను కోల్పోగా.. హరీశ్‌ పర్యవేక్షించిన పటాన్‌చెరు నియోజకవర్గంలో మాత్రం అన్నిట్లోనూ విజయం సాధించడం విశేషం. 

Minister Harish Rao Success in GHMC Elections
Author
Hyderabad, First Published Dec 5, 2020, 8:01 AM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఊహించని దెబ్బ తగిలింది. అనుకున్న స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయింది. అయితే... హరీష్ రావు మాత్రం తన వ్యూహాన్ని అమలు పరిచి.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. తనకు అప్పగించిన మూడు డివిజన్లలోనూ హరీష్ రావు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. 

గతం కంటే ఒక సీటు అధికంగా సాధించి ప్రత్యేకత నిలుపుకొన్నారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ చాలా సిట్టింగ్‌ డివిజన్లను కోల్పోగా.. హరీశ్‌ పర్యవేక్షించిన పటాన్‌చెరు నియోజకవర్గంలో మాత్రం అన్నిట్లోనూ విజయం సాధించడం విశేషం. తద్వారా, దుబ్బాక ఉప ఎన్నిక చేదు అనుభవాన్ని హరీశ్‌ అధిగమించగలిగారు. దీనివెనుక ఆయన అమలు చేసిన మూడంచెల వ్యూహం కీలక పాత్ర పోషించింది. 

2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్లను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. పటాన్‌చెరు డివిజన్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లింది. ఈసారి మాత్రం మూడింటినీ చేజిక్కించుకోవాలని హరీశ్‌ పకడ్బందీ వ్యూహం రచించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌కు పార్టీ తరఫున ఒకరిని బాధ్యుడిగా నియమించారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు డివిజన్‌ బాధ్యతలు అప్పగించారు. పటాన్‌చెరును మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రామచంద్రాపురం, భారతీనగర్‌లను అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ పర్యవేక్షించారు.  కాంత్రికిరణ్‌కు రామచంద్రాపురం ప్రాంతంతో అనుబంధం ఉండటం గమనార్హం.

ఇక క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు  పటాన్‌చెరు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణకు రామచంద్రాపురం, ఎమ్మెల్సీ పి.భూపాల్‌రెడ్డికి భారతీనగర్‌లను కేటాయించారు. ప్రచారం, ఇతరత్రా వ్యవహారాలు చూసే బాధ్యతను ఎమ్మెల్యే జి.మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌కు అప్పగించారు. నాయకులు క్షేత్రస్థాయిలో ప్రచారం పకడ్బందీగా నిర్వహించేలా మంత్రి పర్యవేక్షించారు.

నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ప్రచారం మొదలైనప్పటి నుంచి ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించడమే కాకుండా వివిధ సంఘాల ప్రతినిధులు, ముఖ్య సభ్యులను పిలిచి మాట్లాడారు. కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ హరీశ్‌ సమావేశమై తమ వైపు తిప్పుకొనేలా చేశారు. ప్రచారం చివరి రోజున మంత్రి నిర్వహించిన బహిరంగ సభలు కూడా వియవంతమయ్యాయి. మూడు డివిజన్ల యంత్రాంగం అంతటినీ ఒక్కతాటిపై నడిపించి తన బాధ్యతలకు పూర్తి న్యాయం చేకూర్చారు.

  
 

Follow Us:
Download App:
  • android
  • ios