Harish Rao : కరువు, కర్ఫ్యూ వున్నాయా .. 90 శాతం హామీలు నెరవేర్చాం .. కేసీఆర్ ఆ రికార్డ్ కొడతారు : హరీశ్‌రావు
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి సీఎం కావడం ద్వారా.. దక్షిణాదిన ఈ ఘనత సాధించిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్తారని జోస్యం చెప్పారు మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూలు లాంటివి లేవని.. తెలంగాణలో సంపద పెరిగిందని హరీశ్ చెప్పారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి సీఎం కావడం ద్వారా.. దక్షిణాదిన ఈ ఘనత సాధించిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్తారని జోస్యం చెప్పారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. విపక్షాలకు ఒక అజెండా లేదని.. వారు బీఆర్ఎస్ నేతలను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూలు లాంటివి లేవని.. తెలంగాణలో సంపద పెరిగిందని హరీశ్ చెప్పారు. అప్పుల విషయంలో కింద నుంచి ఐదో రాష్ట్రంగా తెలంగాణ వుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మౌలిక వసతులు కల్పించి.. రాష్ట్ర సంపదను ఇంకా పెంచుతామని, దానిని ప్రజలకు పంచుతామని మంత్రి హమీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారెంటీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు. అక్కడ 5 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని.. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.
కేసీఆర్ చేసిన అభివృద్ధితో ఆయనను గెలిపించబోతున్నారని.. ఆయన నాయకత్వంలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చామని హరీశ్ తెలిపారు. విపక్ష నేతలకు ప్రజలకు పోలింగ్ బూత్‌లలో బుద్ధి చెప్పాలని.. కేసీఆర్‌ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని.. ఇచ్చిన హామీలను నెరవేర్చని చరిత్ర ఆ పార్టీదేనని హరీశ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వాసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 76 శాతానికి చేరుకున్నాయని మంత్రి పేర్కొన్నారు.
వెయ్యికి పైగా గురుకులాల్లో విద్య.. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, కేసీఆర్ బీమా, రైతుబంధు అమలు చేస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. కేసీఆర్ దూరదృష్టి వల్లే తెలంగాణలో విద్యుత్ కోతను అధిగమించగలిగామని మంత్రి వెల్లడించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన 90 శాతం హామీలు అమలు చేశామని.. పెట్టని వాటిని కూడా అమలు చేశామని హరీశ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆరు లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని, 90 వేల ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేశామని మంత్రి వెల్లడించారు.