నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా, హంగ్ కాదు హ్యాట్రిక్ కొడతాం: మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ ప్రయోగాత్మకంగా తీసుకువచ్చిన చేరికల కమిటీ అట్టర్ ప్లాఫ్ అయ్యిందని విమర్శించారు.

కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి హరీష్ రావు శనివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని హాజీపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా అని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రయోగాత్మకంగా తీసుకువచ్చిన చేరికల కమిటీ అట్టర్ ప్లాఫ్ అయ్యిందని విమర్శించారు. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకోవాలని సెటైర్లు వేశారు. అలా చేస్తే పరువైన దక్కుతుందని అన్నారు.
జేపీ నడ్డా ఆయన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు వచ్చి ఆయన చేసేది ఏమి లేదని విమర్శించారు. తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలపై కూడా హరీష్ రావు స్పందించారు. బీఎల్ సంతోష్.. తెలంగాణలో వచ్చేది హంగ్ కాదు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఎల్ సంతోష్ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించారని విమర్శించారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా హరీష్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, మంటలు అని విమర్శలు గుప్పించారు. సీఎం కుర్చీ కోసం మతం మంటలు రేపిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నక్సలైట్లతో చర్చలు అని వారిని మట్టు బెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తం అని విమర్శించారు.