Asianet News TeluguAsianet News Telugu

నీళ్లు, నిధులు, నియామకాలపై అమిత్ షా అబద్ధాలు: హరీష్ రావు.. అసలు విషయం ఇదీ అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి

తెలంగాణ మంత్రి హరీష్ రావు.. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. నీళ్లు, నిధులు, నియామకాలపై అమిత్ షా అర్థసత్యాలు, అసత్యాలు పలికారని, ఆ మూడింటిలోనూ తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని వివరించారు.
 

minister Harish Rao slams amit shah over his comments on telangana
Author
Hyderabad, First Published Jul 4, 2022, 4:43 PM IST

హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావు బీజేపీపై నిప్పులు కురిపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అబద్ధాలు మాట్లాడి స్థాయి తగ్గించుకోవద్దని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్లు సాకారం కాలేదని స్థూలంగా అమిత్ షా అన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలపై ఆయన మీడియా సమావేశంలో వివరంగా మాట్లాడారు. అంతేకాదు, తెలంగాణ అభివృద్ధితో పోల్చుతూ డబుల్ ఇంజిన్ ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎందుకు దిగజారిపోయిందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ పోరు ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్లతో ఉధృతమైన సంగతి తెలిసిందే. ఈ మూడు విషయాలపై బీజేపీ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు తనదైన రీతిలో క్లారిటీ ఇచ్చారు.

‘పానీ ఆయా క్యా.. పానీ ఆయా క్యా’ అని అమిత్ షా నొక్కి వక్కాణించారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణలో నీళ్లు వచ్చింది నిజం కాదా? అంటూ ఆయన బీజేపీని సూటిగా ప్రశ్నించారు. నీళ్లు వచ్చాయో రాలేదో గ్రామాల్లోకి వెళ్లి రైతులను అడిగి తెలుసుకోవాలని, బీజేపీ కార్యకర్తలను అడిగితే ఎలా తెలుస్తుందని అన్నారు. తమతో వస్తే.. తెలంగాణలో నీళ్లు వచ్చాయో లేదో చూపిస్తామని చెప్పారు. పాలమూరు వెళ్లినా.. నల్లగొండ, సూర్యపేట, తుంగతుర్తి.. కరీంనగర్.. ఎక్కడికి వెళ్లినా నీళ్లు ఎలా వస్తున్నాయో తెలుస్తుందని తెలిపారు. అంతేకాదు, అదే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తెలంగాణ నుంచి ఒక లక్ష కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు కదా..? తెలంగాణలో నీటి పారుదల లేకుండా అంతటి  పంట ఎలా పండుతుందని ఎదురు ప్రశ్నించారు. దేశంలో సాగులో 3 శాతం వృద్ధి రేటు ఉంటే.. తెలంగాణలో మాత్రం పది శాతం ఉన్నదని వివరించారు.

నిధుల్లేవని పేర్కొనడాన్నీ ఆయన తప్పుబట్టారు. నిధులు లేకుండానే తెలంగాణ అభివృద్ధి చెందిందా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి చూస్తే.. తమ రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని వివరించారు. రాష్ట్ర ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో పదోస్థానంలో ఉండగా నేడు మూడో స్థానానికి ఎగబాకిందని తెలిపారు. మరి డబుల్ ఇంజిన్ (కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ ఏమైందంటూ ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో సగటు పౌరుడి తలసరి ఆదాయం రూ. 2 లక్షలకుపైగా ఉన్నదని.. అదే ఉత్తరప్రదేశ్‌లో రూ. 71 వేలు మాత్రమే ఉన్నదని పోల్చారు. రాష్ట్రంలో సంపద పెరిగిందని, నిధులు ఉన్నాయి కాబట్టే పేదలకు పంచుతున్నామని స్పష్టం చేశారు. పింఛన్‌ను రెండు వేలకు పెంచామని, కళ్యాణలక్ష్మీ, రైతు బంధు, బీమా వంటి పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ బడ్జెట్ రూ. 62 వేల కోట్ల నుంచి ఏకంగా 1.82 లక్షలకు పెరగడమే నిధులకు నిదర్శనం అని చెప్పారు. నిజానికి నిధుల గురించి మాట్లాడిన అమిత్ షా న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం సకాలంలో అందిస్తే తమ రాష్ట్రం మరెంతో ఎదిగేదని విమర్శించారు. తెలంగాణలో నిధులు లేవని అబద్దాలు మాట్లాడిన అమిత్ షా.. మరి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల గురించి ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు.

ఇక నియామకాల గురించి తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రస్తావిస్తూ.. రిక్రూట్‌మెంట్ల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి ఉన్నదా? అని నిలదీశారు. కేంద్రంలోని ప్రతి శాఖలో ఖాళీలు ఉన్నాయని, ఖాళీలు లేని డిపార్ట్‌మెంటే లేదని ఆరోపించారు. అంతేకాదు, నియామకాల అంశంపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని, చేపడుతున్నదనీ వివరించారు. మొదటి దఫాాలో 10.50 లక్షల ఉద్యోగాలు, రెండో దఫాలో 90 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఇస్తున్నామనీ తెలిపారు. కానీ, అదే బీజేపీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని, ఆ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios