కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం నిరుద్యోగ యువత ఉసురు పోసుకుంటోందని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. 

కరీంనగర్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ సమస్యను మరింత పెంచుతోందని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు (harish rao) ఆరోపించారు. ఇంతకాలం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించకపోగా... ఇప్పుడేమో అగ్నిపథ్ పథకం పేరిట కొత్త నాటకానికి తెరతీసారని ఆరోపించారు. ఆర్మీ ఉద్యోగాల కోసం బిజెపి సర్కార్ కొత్త పథకం తీసుకువచ్చి నిరుద్యోగ యువత ఉసురు పోసుకుంటోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేసారు.

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఇవాళ మంత్రి హరీష్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పాలనను ప్రశంసించారు. రాష్ట్రంలో ఎంతోమందికి ఉపాధి అందిస్తూనే అభివృద్దికి తోడ్పడుతున్న సింగరేణి సంస్థను అమ్మితే కేంద్రం బోనస్ ఇస్తానంటోంది... కానీ అలాంటి బోనస్ అవసరం లేదని హరీష్ అన్నారు. ఇలా ప్రజల ఆస్తులు అమ్మి కేంద్రం సొమ్ము చేసుకుంటోందని హరీష్ మండిపడ్డారు. 

తెలంగాణ రాష్ట్రం కేసిఆర్ న్యాయకత్వంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తోందని... ఇక ఆరోగ్య సంక్షేమ రంగాల్లో అయితే దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో వంద డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ లో వందకు 60% నార్మల్ డెలివరీలే అవుతున్నాయన్నారు. 6000 ఆక్సిజన్ సెంటర్లు ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ, ప్రభుత్వం టీఆర్ఎస్ దే అని మంత్రి హరీష్ కొనియాడారు. 

ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 4 మెడికల్ కాలేజీలను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. మంథనిలోని పాత ప్రభుత్వాస్పత్రిలో ఆధునికీకరణ పనులు చేపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే మంథని నియోజకవర్గ పరిధిలో మిగిలిపోయిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హరీష్ హామీ ఇచ్చారు. 

తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే కేసిఆర్ నాయకత్వమే వుండాలని... అలాగయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. మళ్ళీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణలో, ఇటు మంథని టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. 

ఇక ఇటీవల అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లపై హరీష్ ఘాటుగా స్పందించారు. ఆర్మీ ఉద్యోగాలకు అగ్నిపథ్ పేరుతో కేంద్రం మంగళం పాడుతోందని...ఆర్మీని ప్రైవేట్‌పరం చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. కేంద్రం నిర్ణయంతో దేశంలో అగ్ని రాజుకుందని చెప్పారు. అగ్నిపథ్‌ను మార్చాలని అడిగితే కాల్చి చంపుతున్నారని మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశంలో అగ్గి రాజుకుందన్నారు.

యువకుల బాధ కేంద్రానికి అర్థం కావడం లేదన్నారు. బండి సంజయ్, డీకే అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దాడుల వెనక ఇక్కడ టీఆర్‌ఎస్‌ హస్తం ఉంటే మరి ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. బీజేపీ మాటలు తీయగా, చేతలు చేదుగా ఉన్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజావ్యవతిరేక నిర్ణయాలతో ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని హరీష్ అన్నారు.