మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీశ్ రావు. పదే పదే ఈటల తన పేరు ప్రస్తావించడం ఆయన భావదారిద్య్రానికి నిదర్శనమన్నారు. ఈటల పార్టీకి చేసిన సేవ కన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువని హరీశ్ తెలిపారు. ఈటల పార్టీని వీడినా టీఆర్ఎస్‌కు నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. కంఠంలో ఊపిరి వున్నంతవరకు కేసీఆర్ మాట జవదాటకకుండా నడుచుకుంటానని హరీశ్ పేర్కొన్నారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడే కాదు, నాకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులు అని మంత్రి స్పష్టం చేశారు. తన భుజాల మీద తుపాకీ పెట్టాలనుకోవడం విఫలయత్నమని హరీశ్ ఎద్దేవా చేశారు. 

మరోవైపు హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు చుక్కలు చూపించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు వ్యూహరచన చేశారు. హుజూరాబాద్ లో కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే అనుసరించాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వ్యూహరచన కూడా చేసినట్లు చెబుతున్నారు. 

Also Read:కేసీఆర్ హుజూరాబాద్ ఆపరేషన్, ఈటెలకు చుక్కలు: నాగార్జునసాగర్ వ్యూహమే

ఆదివారం నుంచే కేసీఆర్ తన వ్యూహరచనను అమలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఇతర పార్టీ ముఖ్యులతో సమావేశమై చర్చలు జరిపారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులతో ఆయన ఫోన్ లో మాట్లాడారు