Asianet News TeluguAsianet News Telugu

మోసం, దగాకు కాంగ్రెస్ మారు పేరు.. వాళ్ల చేతిలో పెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు : హరీశ్‌రావు

కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ అగ్రనేత ,  మంత్రి హరీశ్ రావు . ఆదిలాబాద్ టికెట్‌ను ఎంతకు అమ్ముకున్నారో కాంగ్రెస్ వాళ్లే చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. టికెట్లను అమ్ముకున్నవాళ్ల చేతిలో పెడితే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని హరీశ్ రావు హెచ్చరించారు. 

minister harish rao sensational comments on congress party ksp
Author
First Published Oct 28, 2023, 4:30 PM IST | Last Updated Oct 28, 2023, 4:30 PM IST

కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ అగ్రనేత ,  మంత్రి హరీశ్ రావు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మోసం.. దగాకు కాంగ్రెస్ మారు పేరని, ఆ పార్టీని నమ్మి ఓటేస్తే ఆగం అవుతామన్నారు. గిరిజన తండాలు, గూడేలను పంచాయతీలుగా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేసిందని.. కానీ వాటిని నెరవేర్చింది కేసీఆరేనని హరీశ్ రావు తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజన రైతులను ఆదుకున్నామని.. రైతు బీమా మాదిరిగానే భూమిలేని పేదలకు రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తామని మంత్రి చెప్పారు. 

3 గంటల కరెంట్ కావాల్సిన వాళ్లు కాంగ్రెస్‌కు.. 24 గంటల ఉచిత విద్యుత్ కావాలనుకునేవారు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ , బీజేపీలు పాలించే కర్ణాటక, మహారాష్ట్రలలో రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్లాలని హరీశ్ రావు సూచించారు. పదేళ్ల నుంచి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. ఈ పదేళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని మంత్రి గుర్తుచేశారు. 

Also Read: బీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే హైదరాబాద్ మరో అమరావతే : హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

దేశంలో రైతులకు డబ్బులిచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని హరీశ్ రావు తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతు బంధును రూ.16 వేలకు పెంచుతామని తెలిపారు. ప్రతీ యేటా పది వేల మంది వైద్యులను తెలంగాణ.. దేశానికి అందిస్తోందని, ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రథమ స్థానంలో వుందన్నారు. డిసెంబర్ 30న కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని హరీశ్ రావు తెలిపారు. 

ఆదిలాబాద్ టికెట్‌ను ఎంతకు అమ్ముకున్నారో కాంగ్రెస్ వాళ్లే చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. టికెట్లను అమ్ముకున్నవాళ్ల చేతిలో పెడితే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని హరీశ్ రావు హెచ్చరించారు. ఓటుకు నోటు దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెడతారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటోందని.. ఆ పార్టీలో ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్.. కేసీఆర్ సెంచరీ ఖాయమన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ వుంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటనతో బీఆర్ఎస్ సెంచరీ ఖాయమన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios