Asianet News TeluguAsianet News Telugu

సర్పంచ్ చేసిన అప్పు మిత్తి కట్టిన మంత్రి హరీష్ రావు

హరీష్ రావు మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ఓ సర్పంచి బాధ వినడంతోపాటు.. ఆమెకు సహాయం అందించారు. 

Minister Harish rao helps Sarpanch in Medak
Author
Hyderabad, First Published Feb 15, 2021, 9:40 AM IST

తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ఓ సర్పంచి బాధ వినడంతోపాటు.. ఆమెకు సహాయం అందించారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం మడూర్ గ్రామంలో ఇటీవల రైతు వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్‌ నర్సమ్మ తన బాధను మంత్రి హరీశ్‌రావుతో పంచుకున్నారు. ఏడాది క్రితం గ్రామంలో రూ.5 లక్షల సీసీ రోడ్డు, జీపీ నిధుల ద్వారా మరో రూ.3.5 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు నిర్వహించి ఏడాది అయినప్పటికీ బిల్లులు మంజూరు కాకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు మిత్తి కడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికి రూ.95 వేల వరకు మిత్తి చెల్లించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.


తాను సర్పంచ్‌ అయిన కొద్దిరోజులకే భర్త కిషన్‌  చనిపోయినప్పటికీ చెడ్డపేరు రావొద్దని అప్పు చేసి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. స్పందించిన మంత్రి బిల్లుల ఆలస్యానికి కారణమేంటని పంచాయతీ రాజ్‌ ఈఈ రామచంద్రారెడ్డి, ఏఈ విజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. బిల్లు మంజూరైనప్పటికీ బ్యాంకు ఐఎఫ్‌సీ కోడ్‌ నంబర్‌ను తప్పుగా కొట్టడంతో ఆలస్యమైందని సమాధానమిచ్చారు. దీంతో మంత్రి హరీశ్‌ రూ.లక్ష నగదును సర్పంచ్‌కు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హరీశ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios