అది కోడి కత్తి, మొండి కత్తి అంటారా .. కాస్త లేటైతే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం : విపక్షాలపై హరీశ్ ఫైర్
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి సంబంధించి మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్త ఆలస్యం జరిగి వుంటే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం వుండేదని.. విపక్షాలు ఈ ఘటనపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాయని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి సంబంధించి మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికి హాని చేయడని అన్నారు. కొందరు ఓ వ్యక్తిని రెచ్చగొట్టి.. బాగా తాగించి కత్తితో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. కాస్త ఆలస్యం జరిగి వుంటే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం వుండేదని.. విపక్షాలు ఈ ఘటనపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాయని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మొండి కత్తి, కోడి కత్తి అంటూ హేళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని డీకే శివకుమార్ అంటున్నారని, రేవంత్ మూడు గంటలు చాలు అంటాడని హరీశ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం చెప్పులు లైన్‌లో పెట్టాల్సి వుండేదని, నీటి కోసం రాత్రుళ్లు బావి దగ్గర పడుకోవాల్సి వుండేదని ఆయన గుర్తుచేశారు. 5 గంటల కరెంట్ కావాలనుకుంటే కాంగ్రెస్‌కు.. 24 గంటల కరెంట్ కావాలంటే కారుకు ఓటేయ్యాలని హరీశ్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ సీఎం అయితే తాను మంత్రిగా వుంటానని .. కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిస్తే దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. దుబ్బాకకు డబ్బు సంచులు వస్తున్నాయని , లీడర్లను కొంటున్నారని మంత్రి ఆరోపించారు. వారిని వూళ్లలోకి రానివ్వొద్దని.. కాంగ్రెస్ వాళ్లు చేతకాని దద్దమ్మలని హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గెలిచేది లేదు.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదని మంత్రి జోస్యం చెప్పారు.