ఎవరు అధ్యక్షులను మార్చినా, మంత్రులను మార్చినా ప్రజల మనసులను మార్చలేరని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తాము ఎవరికి బీ టీమ్, ఏ టీమ్ కాదని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని హరీశ్ రావు గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఎవరి ఏజెంట్ కాదన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు, ప్రజలకు మాత్రమే బీఆర్ఎస్ ఏజెంట్ అని స్పష్టం చేశారు. తాము ఎవరికి బీ టీమ్, ఏ టీమ్ కాదని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని హరీశ్ రావు గుర్తుచేశారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మళ్లీ కేసీఆర్‌నే కోరుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎవరు అధ్యక్షులను మార్చినా, మంత్రులను మార్చినా ప్రజల మనసులను మార్చలేరని హరీశ్ స్పష్టం చేశారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారని.. తాము వద్దనుకున్న వారే పార్టీలు మారతారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడడం సరైంది కాదన్నారు హరీశ్ రావు. ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా గవర్నర్ వ్యాఖ్యలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని , కానీ ప్రభుత్వంపై బురద చల్లొద్దని గవర్నర్‌కు హరీష్ రావు సూచించారు. గవర్నర్ కు మంచి కనబడదు, చెడును బూతద్దంలో చూస్తారని మంత్రి హరీష్ రావు చెప్పారు.
Also Read: బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడొద్దు: ఉస్మానియాపై తమిళిసైకి హరీష్ కౌంటర్
వైద్యరంగంలో అభివృద్ధి గవర్నర్ కు కన్పించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. గవర్నర్ లో రాజకీయాలు కన్పిస్తున్నాయని .. చెడు చూస్తాం, చెడు వింటాం, చెడు మాట్లాడుతామంటే ఎలా అని ఆయన నిలదీశారు. 2015లోనే ఉస్మానియా ఆసుపత్రిని కేసీఆర్ సందర్శించిన విషయాన్ని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని కట్టాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. అయితే కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
