తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న తెలుగు దేశం వంటి వలస పార్టీలకు, చంద్రబాబు వంటి వలస నాయకులను మరోసారి తెలంగాణపై  రుద్దడానికే కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకుంటోందని మంత్రి  హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ  చేస్తున్న ఈ ప్రయత్నానికి కోదండరాం ఆద్వర్యంలోని తెలంగాణ జనసమితి మద్దతివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వలస వాద నేతల మోచేతి నీళ్లకు అలవాటు పడ్డ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో గెలవలేమని తెలిసే  చంద్రబాబును నమ్ముకున్నారన్నారు. తెలంగాణ పై అధికారం చలాయించేందుకు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ముసుగును నమ్ముకున్నారని చెప్పారు. కాని తెరాస మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల్నే నమ్ముకుందని చెప్పారు. 

 నాగర్ కర్నూల్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు రోడ్‌షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాకూటమిపై నిప్పులు‌ చెరిగారు. పాలమూరు నుంచి వలసలు  వెళ్లే  రీతిలో కాంగ్రెస్, టీడీపీల  పాలన ఆనాడు సాగిందన్నారు. నాలుగేళ్ల తెరాస పాలనలో‌ వలస‌ వెళ్లిన పాలమూరు ప్రజలు ‌తిరిగి వెనక్కు వస్తున్నారని చెప్పారు. కాని కాంగ్రెస్ నేతలు మాత్రం వలస పాలకుల్ని భుజాలపై ఎత్తికుని మళ్లీలోకి తెలంగాణ తెస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఎన్నికల్లో అభివృద్ది సాధకులు, నిరోధకుల మధ్యే పోటీ నెలకొందన్నారు. 

పాలమూరు పచ్చబడాలని తెరాస ప్రభుత్వం ప్రాజెక్టులు‌ కడుతుంటే, కొందరు నేతలు న్యాయస్థానంలో కేసులు వేసి అడ్డం పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే పదేళ్లయినా కల్వకుర్తి ద్వారా నీరిచ్చే వారు కాదన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక 26టీఎంసీల నీటిని కల్వకుర్తి ద్వారా ఇచ్చామన్నారు. శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని పాలమూరు కు ఇస్తుంటే....చంద్రబాబు ఓర్వలేక కేంద్రానికి ఫిర్యాదు లేఖ రాసారని చెప్పారు. కల్వకుర్తి మోటార్లు బంద్ చేయించాలని, ఆ నీటిని పోతిరెడ్డిపాడుకు తరిలించుకు పోతామని చెబుతున్నారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు మోటార్లు ఆపి రాయలసీమకు నీటిని తరలిస్తామనే...చంద్రబాబుతో ఎలా కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. మహాకూటమికి మద్దతు ఇస్తే చంద్రబాబు కల్వకుర్తి మోటార్లు నడవనిస్తాడా అని ప్రశ్నించారు.  

గోదావరిపై ప్రాణహిత చేవెల్ల, కృష్ణాపై  పాలమూరు - రంగారెడ్డి కడుతున్నట్లు‌ ఆనాటి సీఎం వైఎస్  జీవోలు జారీ చేసి, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు  తరలించుకుపోయాడని హరీష్ గుర్తు చేశారు. అప్పుడు మంత్రులుగా వున్న ఉత్తమ్, జానారెడ్డి, డికే అరుణ, కోమటి రెడ్డి వంటి నేతలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారని తెలిపారు. 

2009ఎన్నికల్లో నంద్యాల సభలో ‌వైఎస్ మాట్లాడుతూ....హైదరాబాద్ రావాలంటే పాస్ పోర్ట్ తీసుకోవాలా...అంటే ఒక్క తెలంగాణ కాంగ్రెస్ నేత మాట్లాడలేదన్నారు. తెలంగాణ వస్తే పులిచింతల కట్టనివ్వరంటే....మాట్లాడలేదన్నారు. బాంబులతో ఆర్జీఎస్ తూములు పేల్చి నీటిని తరలించుకుపోతే చప్పుడు చేయలేదన్నారు. ఏడు వేల కోట్లు చిత్తూరు జిల్లాకు తాగు నీటి కోసం ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఖర్చు చేస్తుంటే....తెలంగాణ కు నేను నిధులు అడిగానన్నారు.ఒక్క రూపాయి తెలంగాణ కు ఇవ్వనని శాసన సభలో కిరణ్ కుండ బద్దలు కొట్టినట్లు‌ చెబితే ఒక్క తెలంగాణ కాంగ్రెస్ నేత నోరు మెదపలేదన్నారు. ఈనాడు తెలంగాణ తెచ్చింది మేమే అని కాంగ్రెస్ నేతలు‌ గొప్పలు‌ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. 

వైస్ఆర్సీపీ, టీడీపీ లను తెలంగాణ ద్రోహుల పార్టీగా ప్రకటించిన కోదండరాం టీడీపీతో పొత్తు‌ ఎలా‌ పెట్టుకుంటారని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి చంద్రబాబు తో పొత్తు పెట్టుకోవడం అనైతికమన్నారు.  కృష్ణా, గోదావరి నీరు తెలంగాణ కు‌‌ దక్కాలన్నా, ఆ నదులపై ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా తెరాస గెలవడం అవసరమన్నారు. వలసవాద నేతలు మళ్లీ వస్తే‌ తెలంగాణ ‌ఆగమేనని హరీష్్ హెచ్చరించారు.