Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదు.. ప్రజలకు నిరాశే మిగిలింది: కేంద్రంపై హరీష్ రావు ఫైర్

బీజేపీ నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి, తెలంగాణకు ఏదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. 

minister harish rao fires on central government and questions amit shah
Author
First Published Jul 4, 2022, 3:40 PM IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు మీడియాతో మట్లాడారు. బీజేపీ నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదని విమర్శించారు. రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి, తెలంగాణకు ఏదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. అక్కడ కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదని ఎద్దేవా చేశారు. విభజన చట్టం హామీల ఊసే లేదని.. తెలంగాణకు ఏం చేస్తారనే విషయం ఒక్క బీజేపీ నాయకుడు కూడా చెప్పలేదని మండిపడ్డారు. 18 రాష్ట్రాల సీఎంలు హైదరాబాద్‌కు వచ్చారని.. వారి రాష్ట్రాలలో  తెలంగాణ కంటే ఎక్కువ ఏం చేశారో చెప్పగలిగారా అని ప్రశ్నించారు. బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదని మరోసారి రుజువైందని అన్నారు. 

పంజాబ్ తర్వాత అత్యధికంగా వరి పండించేది తెలంగాణ అని.. ఈ విషయం నీతి అయోగ్ చెప్పిందేనని అన్నారు. అమిత్ షా నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడారని.. తెలంగాణ నీళ్లు, నిధులు నియామకాలు వచ్చాయని ఎవరిని అడిగినా చెబుతారన్నారు. దేశంలో వ్యవసాయ వృద్దిరేటు 3 శాతంగా ఉంటే.. తెలంగాణలో 10 శాతం ఉందన్నారు. నీళ్లు ఇవ్వకుండానే పంట పండకుండానే లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నారా అని ప్రశ్నించారు.
ఏ జిల్లాకు అయినా వెళదామని.. తనతో పాటు వస్తే నీళ్లు ఎలా వచ్చాయోచూపిస్తానని అమిత్‌ షాకు సవాల్‌ విసిరారు. అమిత్ షా అవగాహన లేకుండా మాట్లాడి స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి అమిత్ షా తన వ్యాఖ్యలతో తెలంగాణ రైతులను అవమానించారన్నారు. 

బీజేపీ ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాల గురించి అమిత్ షా ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. దమ్ముంటే 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో అమిత్ షా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అమిత్ షా ఏదో చెబితే నమ్మడానికి సిద్ధంగా ఎవరూ లేరని అన్నారు. తెలంగాణలో ఖాళీలన్ని భర్తీ చేస్తున్నామని చెప్పారు.

మహిళల గురించి ఏదో గొప్పగా మోదీ మాట్లాడారని.. మరి  8 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ను కేంద్రం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. మహిళకు కన్నీళ్లు తెప్పిస్తున్న సిలిండర్ ధర పెంచిన విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అబద్దాలు చెబుతున్నారని.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చి రూ.80 వేల కోట్ల రుణానికి ఆమోదించింది కేంద్రం కాదా ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరగలేదని కేంద్రమంత్రి చెప్పలేదా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ అంకిత భావం వల్లే తెలంగాణ అభివృద్ధిలో దూసుకు పోతుందన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios