బీజేపీపై మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ జూటా మాటలు మాట్లాడుతోందని... గిరిజన బిడ్డల కోసం కేసీఆర్ ఎంతో చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. గతంలో కాన్పు కావాలంటే బీదర్ పోయేవాళ్లని... ఇప్పుడు కర్ణాటక నుంచి ఇక్కడికి వస్తున్నారని హరీశ్ రావు వెల్లడించారు. 

కాంగ్రెస్ (congress) హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు అందుకునేవారని అన్నారు మంత్రి హరీశ్ రావు (harish rao) . పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కంగ్టి మండలానికి మంత్రి సత్యవతి రాథోడ్‌తో (satyavathi rathod) కలిసి హరీశ్ రావు శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ (trs) హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు మీకు కనిపిస్తాయన్నారు. గత 5 ఏళ్లలో రూ. 36 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశామని.. 54 తండాలను గ్రామ పంచాయతీలు చేశామని హరీశ్ రావు గుర్తుచేశారు. 70 ఏళ్లలో కనీసం ఒక్క గిరిజన పాఠశాల లేదని భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నాలుగు వచ్చాయని.. గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారని మంత్రి అన్నారు. మంచినీళ్ల కోసం ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు మోసి భుజాలు కాయలు కాసేవని.. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నారని గుర్తుచేశారు. 

Also Read:‘‘నేను చదువుకోలేదు.. వైద్య సేవలకు నూటికి నూరు మార్కులు వేస్తా’’ : అవ్వ సమాధానానికి హరీశ్ ఖుషీ (వీడియో)

రైతులకు ఎలాంటి కష్టం ఉండకూడదని పంట పెట్టుబడి సాయం ఇస్తున్నామని.. కానీ, బీజేపీ జూటా మాటలు మాట్లాడుతోందని హరీశ్ రావు ఫైరయ్యారు. కర్ణాటకలో ఏముంది? రైతు బంధు ఉందా? రైతు బీమా ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. పక్కన ఉన్న కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారు వుందని.. అయినా ఎందుకు రూ.500 పింఛన్ ఇస్తున్నారని హరీశ్ రావు నిలదీశారు. తెలంగాణలో మాదిరే ఎందుకు రూ. 2016 ఇవ్వడం లేదని మంత్రి ప్రశ్నించారు. గతంలో కాన్పు కావాలంటే బీదర్ పోయేవాళ్లని... ఇప్పుడు కర్ణాటక నుంచి ఇక్కడికి వస్తున్నారని హరీశ్ రావు వెల్లడించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు గిరిజన పల్లెలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా మారిపోయాయో ఆలోచించాలని సూచించారు. ఎస్టీ ప్రజల చిరకాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారని... అన్ని తండాలకు రోడ్లు వేస్తామన్నారు.