Asianet News TeluguAsianet News Telugu

దళితబంధు: మీరు ఇంకో రూ.40 లక్షలు ఇస్తే.. పాలాభిషేకం చేస్తాం, బండి సంజయ్‌కి హరీశ్ కౌంటర్

తమకు చేతనైనంతలో దళితులకు పది లక్షలు ఇస్తున్నామని.. కానీ బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలని అంటున్నారని, అలాంటప్పుడు ఆయన ఢిల్లీ నుంచి రూ.40 లక్షలు తీసుకొచ్చి ఇస్తే సంతోషిస్తామని హరీశ్ అన్నారు. అదే జరిగితే ప్రధాని మోడీ, బండి సంజయ్‌లకు పాలాభిషేకం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు

minister harish rao counter to telangana bjp chief bandi sanjay
Author
Huzurabad, First Published Aug 14, 2021, 3:42 PM IST

హుజురాబాద్‌లోని ప్రతి కుటుంబానికి దళిత బంధును నూటికి నూరు శాతం అందజేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. శనివారం హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎటువంటి చెప్పుడు మాటలు వినొద్దని, అనుమానాలు, అపోహాలకు తావు లేదని తెలిపారు. రైతు బంధు కార్యక్రమాన్ని కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోనే కేసీఆర్ ప్రారంభించారని హరీశ్ రావు గుర్తుచేశారు.

ఆ సమయంలో కూడా ఇది కొద్దిమందికే వస్తుందని కొందరు.. వున్నత వర్గాలకే వస్తుందని మరికొందరు, ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కానీ రైతు బంధు నిరాటంకంగా, కరోనా సమయంలోనూ కొనసాగుతోందని చెప్పారు. ఇదే రైతు బంధుని హుజురాబాద్‌లో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులే .. ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని మండిపడ్డారు.

ఓటమి భయంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద హుజురాబాద్‌లో దళిత బంధుని అమలు చేయడానికి రూ.2000 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం  చేసిందని మంత్రి తెలిపారు. హుజురాబాద్‌లోని 20 వేల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని హరీశ్ పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లోనే సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు తానే చెప్పానని గుర్తుచేశారు. అప్పుడు హుజురాబాద్ ఎన్నికలు కానీ, మరే ఇతర ఎన్నికలు లేవని మంత్రి వెల్లడించారు.  మార్చి బడ్జెట్ సమావేశాల్లోనే ఒక కొత్త పథకాన్ని దళితుల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. నాడు ఇదే హుజురాబాద్‌లో రైతు బంధు ప్రారంభిస్తే తప్పులేనిది ఇప్పుడు దళిత బంధు ప్రారంభిస్తే తప్పేంటని హరీశ్ రావు ప్రశ్నించారు. మంచి జరుగుతుంటే ఇక్కడ నిరసనలు చెప్పిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

తమకు చేతనైనంతలో పది లక్షలు ఇస్తున్నామని.. కానీ బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలని అంటున్నారని, అలాంటప్పుడు ఆయన ఢిల్లీ నుంచి రూ.40 లక్షలు తీసుకొచ్చి ఇస్తే సంతోషిస్తామని హరీశ్ అన్నారు. అదే జరిగితే ప్రధాని మోడీ, బండి సంజయ్‌లకు పాలాభిషేకం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సోమవారం 15 కుటుంబాలకు సీఎం చేతుల మీదుగా దళిత బంధుని అందజేస్తామన్నారు. ఆ తర్వాత ప్రత్యేకాధికారి ద్వారా గ్రామంలోని ప్రజల మధ్యే సభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హరీశ్ వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తోందని మంత్రి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios