Asianet News TeluguAsianet News Telugu

మీ తప్పుల్ని ప్రశ్నిస్తే కుటుంబ పార్టీనా.. మేం అధికారం లాక్కోలేదు, ప్రజలే ఇచ్చారు: మోడీకి హరీశ్ రావు కౌంటర్

తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పొత్తు పెట్టుకున్న పార్టీలను ఏమంటారని ఆయన ప్రశ్నించారు. తాము అధికారం లాక్కోలేదని.. ప్రజలే ఇచ్చారని హరీశ్ పేర్కొన్నారు. 

minister harish rao counter to pm narendra modi over his remarks on trs party
Author
Hyderabad, First Published May 26, 2022, 7:16 PM IST

తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీపై (trs)  ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు. గురివింద గింజ తన కింద నలుపు చూసుకోవాలంటూ చురకలు వేశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు బీజేపీలో (bjp) లేడా ..? మీది కుటుంబ పార్టీ కాదా .. ? అని ఆయన ప్రశ్నించారు. యూపీలో బీజేపీ పొత్తు పెట్టుకున్న అప్నాదళ్ (apna dal) కుటుంబ పార్టీ కాదా అని హరీశ్ రావు నిలదీశారు. పంజాబ్‌లో గతంలో అకాళీదళ్‌తో (shiromani akali dal) అధికారం పంచుకోలేదా.. అది కుటుంబ పార్టీ కాదా అని మంత్రి ప్రశ్నించారు. 

మీ తప్పులు ఎత్తిచూపితే కుటుంబ పార్టీ అంటారని హరీశ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ది కుటుంబ పార్టీ కాదని, తెలంగాణయే ఓ కుటుంబం అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్నే కుటుంబంగా భావిస్తూ పరిపాలించే నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అధికారం లాక్కుంటే రాలేదని.. తమకు ప్రజలే ఇచ్చారని హరీశ్ రావు చురకలు వేశారు. భారత రాజ్యాంగం ప్రకారం తాము నడుచుకుంటామని మంత్రి అన్నారు. కుటుంబ రాజకీయాలపై ప్రధాని మోడీ మాట్లాడటం సిగ్గు చేటుగా వుందన్నారు. 

అంతకుముందు  ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (palla rajeshwar reddy) కౌంటరిచ్చారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చి ఇచ్చిందేమీ లేకపోగా తెలంగాణపైనే విషం కక్కి వెళ్లిపోయారని అన్నారు. ప్రధాని హోదాలో ఉండి అబద్దాలు చెప్పారన్నారు. తెలంగాణకు ఒక్క సంస్థను ఇవ్వకుండా అన్యాయం చేశారని... మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్ ఎందుకు ఇవ్వలేదని పల్లా ప్రశ్నించారు. 

తెలంగాణ ఐటీఐఆర్ ను రద్దు చేసిన చరిత్ర మోడీది అని మండిపడ్డారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీ లో కలిపి ఇబ్బంది పెట్టారన్నారు. ప్రభుత్వ సంస్థలను మోడీ అమ్మేయడమే కాదు లక్షల కోట్ల అప్పులు చేసి భారం మోపుతున్నారని ఆరోపించారు. వృద్ధిలో, తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ గా వుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను తెలంగాణ సాకుతోందని పల్లా పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి అవసరాలకు అనుగుణంగా కొత్త సచివాలయాన్ని కట్టుకుంటున్నామని పల్లా పేర్కొన్నారు.

ALso Read:తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే: టీఆర్ఎస్ పై మోడీ పరోక్ష విమర్శలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ది మూడనమ్మకమే అయితే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం కూడా మూడనమ్మకమేనా? అని ప్రధానిని ప్రశ్నించారు పల్లా. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి... అలాకాకుండా కేవలం రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం తగదని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఆశయాల్లో ఒకటయిన ఉద్యోగ నియామకాలను కేసీఆర్ ప్రభుత్వం చేపడుతోందని పల్లా పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షా 31 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తయిందని... ఇంకా లక్షమందికి ఉద్యోగాలివ్వడానికి సిద్దంగా వున్నామన్నారు. ఇక మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు ఐటీ రంగంలో, 17 లక్షలకు పైగా ఉద్యోగాలు ప్రైవేట్ ఇండస్ట్రీస్ కల్పించామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలోనే నిరుద్యోగిత తగ్గిందని కేంద్రమే చెబుతూ అవార్డులు ఇస్తోందని పల్లా గుర్తుచేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios