తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కి చేదు అనుభవం ఎదురైంది. అరగంట పాటు ఆయన లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. అధికారులు నానా అవస్థలు పడి ఆయనను బయటకు తీశారు. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. దీంతో... ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణంపై విమర్శలు ఎదురౌతున్నాయి. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ 8వ అంతస్థులోని 810 ఫ్లాట్‌ (క్వార్టర్‌)లో నివాసముంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంట ల ప్రాంతంలో తన అనుచరులు, వ్యక్తిగత సిబ్బందితో కలసి రేషన్‌ డీలర్ల సమావేశానికి హాజరయ్యేందుకు ఫ్లాట్‌ నుంచి బయలుదేరారు. లిఫ్ట్‌లోకి వెళ్లిన తర్వాత కిందకి వెళ్లే బటన్‌ నొక్కడంతో లిఫ్ట్‌ డోర్లు మూసుకుపోయాయి.

 లిఫ్ట్‌ ఎటూ కదలకపోవడం, డోర్లు కూడా తెరుచుకోకపోవడంతో ఆందోళన చెందిన మంత్రి సిబ్బంది క్వార్టర్స్‌ నిర్వహణాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది అక్కడకు చేరుకుని అరగంట పాటు నానా శ్రమ పడి గడ్డపార, స్కూ డ్రైవర్‌ ఉపయోగించి డోర్లు తెరిచారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే క్వార్టర్స్‌ అధికారులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పరిమితికి మించిన బరువు వల్లే లిఫ్ట్‌ నిలిచిపోయిందని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ సెక్షన్‌ అధికారి సునీల్‌ తెలిపారు. మంత్రితోపాటు ఆయన అనుచరులు, సిబ్బంది మొత్తం 13 మంది వరకు ఆ సమయంలో లిఫ్ట్‌ ఎక్కడం వల్ల ఇలా జరిగిందన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించి కనీసం 6 నెలలు కూడా గడవక ముందే ఇలాంటి సమస్యలు తలెత్తడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి.