ఇన్నాళ్లూ మంత్రిగా వెలగబెట్టి.. హుజురాబాద్‌కు ఏం చేశారు: ఈటలపై మరోసారి గంగుల విమర్శలు
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నో ఏళ్లు మంత్రిగా వుంటున్నప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల చేసిందేమీ లేదని... ఇప్పుడు ఆయన చేసేదేముందంటూ ఎద్దేవా చేశారు
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నో ఏళ్లు మంత్రిగా వుంటున్నప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల చేసిందేమీ లేదని... ఇప్పుడు ఆయన చేసేదేముందంటూ ఎద్దేవా చేశారు. తన సొంత పనుల కోసమే సీఎం కేసీఆర్ వద్దకు ఈటల వెళ్లేవారని... నియోజకవర్గ పనుల కోసం ఏనాడూ వెళ్లలేదని గంగుల ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు సార్లు ఈటల మంత్రి పదవిని చేపట్టినా హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎందుకు జరగలేదని కమలాకర్ ప్రశ్నించారు.
Also Read:దళితుడికి న్యాయం చేయలేదు: కేసీఆర్ పై ఈటల ఫైర్
తామంతా తమ నియోజకవర్గ పరిస్థితిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే రూ. 31 కోట్లను మంజూరు చేశారని గంగుల వెల్లడించారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ జరగని అభివృద్ధిని కేవలం ఏడేళ్లలో కేసీఆర్ చేశారని మంత్రి ప్రశంసించారు. దేశంలో విద్యుత్తును ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని గంగుల కమలాకర్ జోస్యం చెప్పారు. ఈటలను నియోజకవర్గ ప్రజలు నమ్మరంటూ దుయ్యబట్టారు.