గంగుల ప్రయాణిస్తున్న పడవ బోల్తా... చెరువు నీటిలో పడిపోయిన మంత్రి (వీడియో)
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ఊరూరా చెరువుల పండగ కార్యక్రమం పలుచోట్ల ప్రమాదాలకు కారణమయ్యింది. భీంగల్ అగ్ని ప్రమాదం, కరీంనగర్ లో పడవ బోల్తా ప్రమాదాల నుండి మంత్రులు వేముల, గంగుల బయటపడ్డారు.
కరీంనగర్ : తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పడవ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో మంత్రి గంగుల పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ నాటుపడవ ఎక్కి చెరువులో వెళుతుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. మంత్రి ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడటంతో ఆయన నీటిలో పడిపోయారు. అయితే ఆయన పడినచోట చెరువు లోతు తక్కువగా వుండటంతో ప్రమాదం తప్పింది.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను కేసీఆర్ సర్కార్ ఘనంగా నిరహిస్తోంది. ఇందులో భాగంగానే బిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా పునరుద్దరించిన చెరువుల వద్ద వేడుకలు నిర్వహించారు. ఊరూరా చెరువుల పండగ పేరిట రాష్ట్రవ్యాప్తంగా వున్న చెరువుల వద్ద ప్రజా ప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వేడుకలు నిర్వహించారు. ఇలా కరీంనగర్ రూరల్ మండలం అసిఫానగర్ చెరువు వద్ద జరిగిన వేడుకల్లో మంత్రి గంగుల పాల్గొన్నారు.
Read More చెరువుల పండగలో అపశృతి... మంత్రి ప్రశాంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం
చెరువు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి గంగుల ప్రజలు, బిఆర్ఎస్ కార్యకర్తల కోరిక మేరకు నాటు పడవ ఎక్కారు. ఈ పడవపై చెరువునీటిలోకి వెళుతుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. నాటుపడవ నీటిలో బోల్తా పడటంతో మంత్రి గంగుల చెరువులో పడిపోయారు. కానీ ప్రమాదం జరిగిన ప్రాంతంలో లోతు తక్కువగా వుండటంతో మంత్రి గంగుల నడుచుకుంటూ బయటకు వచ్చారు.
వీడియో
మంత్రి నీటిలో పడిపోయిన వెంటనే భద్రతా సిబ్బంది, పోలీసులు చెరువులోకి దిగారు. నీటిలో పడిపోయిన గంగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పడవ ప్రమాదం నుండి మంత్రి గంగుల కమాలాకర్ బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.