చెరువుల పండగలో అపశృతి... మంత్రి ప్రశాంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది.

నిజామాబాద్ : తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సొంత నియోజకవర్గంలో మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది, పోలీసులు మంటలను అదుపుచేయడంతో మంత్రితో పాటు ప్రజలకు ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళితే... బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే నిన్న(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా చెరువల పండగ నిర్వహించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల రూపరేఖలు ఎలా మారాయో ప్రజలకు చూపించేందుకు కేసీఆర్ సర్కార్ ఈ చెరువుల పండగ చేపట్టింది. చెరువు కట్టల వద్ద మైసమ్మకు పూజలు చేసి బోనాలు, బతుకమ్మతో ప్రజలు పండగ చేసుకున్నారు.
ఇలా నిజామాబాద్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం బాల్కొండలో జరిగిన చెరువుల పండగలో పాల్గొన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. భీంగల్ మండలం పురానిపేట్ గ్రామ చెరువువద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు మంత్రి. అయితే మంత్రికి స్వాగతం పలికే సమయంలో బిఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారీగా బాణాసంచా పేల్చడంలో నిప్పురవ్వలు ఎగసిపడి కార్యక్రమం కోసం ఏర్పాటుచేసిన టెంట్ పై పడ్డాయి. దీంతోఒక్కసారిగా మంటలు చెలరేగి టెంట్ కాలిపోయింది.
Read More తెలంగాణ చెరువుల వద్ద కోలాహలం...జాలరిగా మారి చేపలు పట్టిన మంత్రి ఎర్రబెల్లి (వీడియో)
టెంట్ కు అంటుకున్న మంటలు చెలరేగకుండా గ్రామస్తులు వెంటనే అర్పేసారు. దీంతో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రమాదం నుండి బయటపడ్డారు.
ఇదిలావుంటే రెండునెలల క్రితం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బిఆర్ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళ్లనంలో ఇలాగే బాణాసంచా కాల్చడం పెను ప్రమాదానికి దారితీసింది. బిఆర్ఎస్ సభాస్థలి సమీపంలోని బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు దగ్గర్లోని ఓ గుడిసెపై పడ్డాయి. దీంతో గుడిసెకు నిప్పంటకుని సిలిండర్లు పేలడంతో నలుగురు మృతిచెందగా చాలామంది గాయపడ్డారు.