త్వరలోనే బీఆర్ఎస్ నేతలను ఈడీ, సీబీఐ, ఐటీలు అరెస్ట్ చేస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గ్యాస్ ధరలు మోడీని గద్దె దించుతాయని దయాకర్ రావు జోస్యం చెప్పారు
కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు పలు కేసుల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తాయని ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాస్ ధరలు మోడీని గద్దె దించుతాయని దయాకర్ రావు జోస్యం చెప్పారు. ఉమెన్స్ డే కానుకగా కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచిందని.. కేంద్రం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తోందని దయాకర్ రావు మండిపడ్డారు. తెలంగాణలో రైతులు పండించేది బాయిల్డ్ రైసేనన్న ఆయన.. కేంద్రం రా రైస్ మాత్రమే కొంటామని మొండిపట్టు పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే .. రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తాను పెద్దగా చదువుకోలేదని, కానీ రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒకసారి పోటీ చేసి.. మరోసారి అక్కడి నుంచి పోటీ చేయలేడని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. కాంట్రాక్టర్ల వద్ద నుంచి రేవంత్ రెడ్డి ఎంత డిమాండ్ చేశారో తనకు తెలుసునని మంత్రి ఆరోపించారు.
Also REad: తమిళిసైపై సుప్రీంకోర్టుకు కేసీఆర్ సర్కార్: 10 బిల్లులు ఆమోదం కోసం పిటిషన్
అంతకుముందు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును, ఆయన తనయుడు డ్రామారావు(మంత్రి కేటీఆర్)ను ఎప్పుడు అరెస్ట్ చేయిస్తారని బండి సంజయ్, ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఎప్పటిలోగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూ కుంభకోణం, సింగరేణి బొగ్గుగనుల దోపిడీ, ఇసుక దోపిడీ మీద కేంద్ర ప్రభుత్వం నుండి విచారణకు ఆదేశాలు ఇప్పిస్తారని బిజెపి నేతలను పిసిసి చీఫ్ ప్రశ్నించారు. లేదంటే ఈ దోపిడీలో మీరు కూడా భాగస్వాములేనని నమ్మాల్సి వస్తుందని రేవంత్ అన్నారు.
