టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోవిడ్ బారిన పడడంపై పట్ల పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ రంగాన్ని అభివృద్ది చేస్తున్న కేటీఆర్‌కి కరోనా లెక్క కాదంటూ వ్యాఖ్యానించారు. 

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు, పోరాట యోధుడు, అన్నింటికీ మించి ఆత్మ స్థైర్యం, గుండె నిబ్బరం కలిగిన కేటీఆర్‌ను ఇలాంటి సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టలేవని ఎర్రబెల్లి పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ త్వరితగతిన కోలుకోవాలని, అయన సేవల కోసం నాతో సహా, యావత్ రాష్ట్రం, దేశం ఎదురుచూస్తోందని దయాకర్ రావు అన్నారు.

Also Read:తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్: హోం ఐసోలేషన్ లో చికిత్స

అంతకుముందు కేటీఆర్ త్వరగా కోలు కోవాలని భగవంతునికి మొక్కుకుంటున్నట్టు మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల మనిషిగా రామారావు త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. 

అంతకుముందు కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కోవిడ్‌కు సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్నట్లు మంత్రి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో తనను కొద్దిరోజులుగా కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.