తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్: హోం ఐసోలేషన్ లో చికిత్స
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కేటీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. తనను కలిసినవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కోవిడ్ కు సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ తో పాటు ఆయన యశోదా ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల తనను కలిసివాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆయన వెంట ఉన్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
తెలంగాణలో నానాటికీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణలో ఒక్క రోజులో 6,209 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనాతో తాజాగా 24 గంటల్లో 29 మంది మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య రాష్ట్రంలో 3.97 లక్షలకు చేరుకుంది.