చలి కాలం కారణంగా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం వుంది కాబట్టి  ప్రజలు జాగ్రత్తగా వుండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి సూచించారు. 

జనగామ: కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యిందని... చలి కాలం కారణంగా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం వుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా వుండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి సూచించారు. ఇంట్లోంచి బయటకు వెళ్లినపుడు మాస్కులు ధరిస్తూ...భౌతిక దూరం పాటిస్తూ...తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని అరికట్టవచ్చాని... ప్రజలు వాటిని పాటించాలని మంత్రి సూచించారు.

జనగామ జిల్లాలో నిర్మాణంలో వున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కొద్ది రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాయన్నారు. త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కెటీఆర్ ల చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామన్నారు. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యమైందని.... అతి త్వరలో కార్యాలయాన్ని పూర్తి చేసి కార్యకర్తలకు,నాయకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. 

మరోవైపు తెలంగాణలో తాజాగా గత 24 గంటల్లో (శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 21264మందికి టెస్టులు చేయగా కేవలం 661మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం టెస్టుల సంఖ్య 48,74,433కు చేరితే మొత్తం కేసుల సంఖ్య 2,57,374కు చేరింది.

ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1637 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,40,545కి చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,425కి చేరింది. 

 ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1404కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.3శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 93.46శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 167కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 45, రంగారెడ్డి 57, భద్రాద్రి కొత్తగూడెం 29, కరీంనగర్ 24, ఖమ్మం 19, నల్గొండ 34, వరంగల్ అర్బన్ 21, సంగారెడ్డి 28 కేసులు నమోదయ్యాయి. మిగతాజిల్లాలో కేసుల సంఖ్య కాస్త తక్కువగా వున్నాయి.