హైదరాబాద్: దేశంలోని ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, మనమంతా దేశ పౌరులనే విషయాన్ని చాటాలని ఎంఐఎం చీఫ్, హైద్రాబాద్ ఎంపీ  అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.

శనివారం నాడు పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ హైద్రాబాద్‌లోని ఎంఐఎం ప్రదాన కార్యాలయంలో  జరిగిన భారీ బహిరంగ సభలో  ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం సిద్దించి 70 ఏళ్లు దాటిన తర్వాత భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితులను ఎన్‌ఆర్సీ కల్పిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

read more  భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రస్తుతం దేశ ప్రజల మధ్య గాంధీ లేరు, ఆయన జ్ఞాపకాలున్నాయన్నారు. అంబేడ్కర్‌ లేరు.. కానీ, ఆయన మనకందించిన రాజ్యాంగం ఉందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం ఉందన్నారు. కేంద్రం తీసుకొన్న చర్యలు  గాంధీ, అంబేద్కర్, మౌలానా ఆజాద్‌ను అవమానించినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇది హిందూ, ముస్లిం, బీజేపీ, మజ్లిస్ మధ్య గొడవ కాదన్నారు.

దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందన్నారు. ఇది నాదేశం, నా దేశం కోసం నా ప్రాణాలను సైతం అర్పిస్తానని అని ఆయన ఉద్వేగంగా చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌తో తనకు సంబంధం లేదన్నారు. అసోంలో, యూపీలో ఒక్క రోజే 12 మంది మృత్యువాత పడడంపై అసదుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో నాలుగు శాతం మందికే పాస్‌పోర్టు ఉందన్నారు. మిగతా వారంతా ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సిన దుస్థితి 70 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకు అని ఆయన ప్రశ్నించారు. ముస్లింపేరు ఎన్ఆర్సీలో లేకపోతే అతడి కుటుంబం ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. ఎన్ఆర్సీ వల్ల నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

దేశంలోని ప్రజలను బీజేపీ రెచ్చగొడుతోందన్నారు. ఎన్ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా హింసకు తావు లేకుండా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు అన్ని వర్గాలు ఒక్క తాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.