ప్రగతి భవన్ ముట్టడించిన పాడి రైతులు మదర్ డైరీకి కూడా 4 రూపాయల ప్రోత్సాహం కోసం ఆందోళన రైతులను అరెస్టు చేసిన పోలీసులు
తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ అనేది లేకపోవడంతో ప్రతి సంఘం వారు చలో ప్రగతిభవన్ ముట్టడికి పిలుపిస్తున్నారు. పెద్ద సమస్య ఉన్నా చిన్న సమస్య ఉన్నా ప్రగతిభవన్ ముట్టడి చేపట్టడంతో హైదరాబాద్ పోలీసులకు టెన్షన్ పట్టుకుంది.

తాజాగా మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పాడి రైతులు చలో ప్రగతిభవన్ కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రైతులు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్ కు చేరుకుని నిరసన తెలిపే ప్రయత్నం చేయడంతో పోలీసులు అరెస్టు చేసి పలు పోలీసు స్టేషన్లకు తరలించారు.

మదర్ డైరీ కి పాలు సరఫరా చేసే రైతులకు కూడా లీటరకు 4 రూపాయల ప్రోత్సాహకం అందజేయాలన్నది ఆ రైతుల డిమాండ్.

55వేల మంది రైతులు సభ్యులుగా ఉన్న మదర్ డైరీ పాలక మండలి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రైతులకు మొండిచేయి చూపుతోందని వారు ఆరోపిస్తున్నారు. విజయ డైరీ రైతులకు 4రూపాయల ప్రోత్సాహం అందజేసినట్లు మదర్ డైరీ రైతులకు కూడా ప్రోత్సాహం అందించేందుకు పాలక మండలి ప్రయత్నం చేయాల్సిందిపోయి పదవుల కోసం పాలకులాడుతూ రైతులను మోసం చేస్తోందని ధర్నాకు నాయకత్వం వహించిన నాయకుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఆరోపించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
