Asianet News TeluguAsianet News Telugu

ఎంపి కవితకు షాక్ ఇవ్వాలని చూశారు

  • మెట్ పల్లిలో రైతుల ఆందోళన
  • ఆగకుండా వెళ్లిపోయిన కవిత కాన్వాయ్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
  • నేడు మెట్ పల్లి బంద్ కు పిలుపునిచ్చిన రైతాంగం
metpally sugar farmers protest aganist mp kavitha

తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, నిజామాబాద్ ఎంపి కవితకే షాక్ ఇచ్చేందుకకు మెట్ పల్లి రైతులు ప్రయత్నం చేశారు. ఈ సంఘటన తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. రైతులు తెలంగాణ రాష్ట్ర సర్కారుపై ఆగ్రహంగా ఉన్నారన్నదానికి ఈ సంఘటన మచ్చుతునకగా మారింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ సంచలన సంఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.

షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా మెట్ పల్లి రైతులు ఆందోళన చేస్తున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే మెట్ పల్లి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని టిఆర్ఎస్ పార్టీ గతంలో హామీ ఇచ్చినట్లు రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు చక్కెర పరిశ్రమ తెరిపించేందుకు ఆందోళనబాట పట్టారు.

మెట్ పల్లిలో శుక్రవారం నాడు ఆందోళనలో పాల్గొన్న రైతులు మార్కెట్ యార్డు నుంచి ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ వద్ద రిలే దీక్షలు షురూ చేశారు. అయితే మెట్ పల్లికి నిజామాబాద్ ఎంపి కవిత ఒక వివాహానికి హాజరయ్యేందుకు వస్తున్నారని తెలిసిన రైతులు ఎలాగైనా ఆమెను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

రైతులు కవితను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని భావించిన పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల వద్దకు వచ్చి వారి సమస్యలను ఎంపి కవిత తెలుసుకునే ప్రయత్నం చేస్తారన్న కబురు ఆ రైతులకు అందింది. దీంతో వారు ఎంపి కోసం చాలాసేపు ఎదురుచూశారు. తర్వాత ఎంపి కాన్వాయ్ రైతుల వద్ద ఆగకుండానే మెట్ పల్లి నుంచి రైతుల దీక్షా శిబిరాన్ని దాటుకుని వెళ్లిపోతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమెను అడ్డుకునేందుకకు రైతులు పోలీసుల వలయాన్ని చేధించుని రోడ్డు మీదకు వచ్చారు. అప్పటికే కవిత కాన్వాయ్ అక్కడినుంచి వెళ్లిపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు మీద ఆందోళనకు దిగారు.  తర్వాత వారు సబ్ కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ వినతిపత్రం సమర్పించారు.

చెరుకు రైతులు ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా వివాహ వేడుకల్లో పాల్గొని వెళ్లిపోయిన ఎంపి కవిత తీరుపై చెరుకు రైతులు మండిపడుతున్నారు. కవిత వైఖరిని నిరసిస్తూ శనివారం మెట్ పల్లి బంద్ కు పిలుపునిచ్చారు చెరుకు రైతులు. బంద్ ను విజయవంతం చేసి తెలంగాణ సర్కారుకు గుణపాఠం చెప్పాలని చెరకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ కన్వీనర్ రాజారెడ్డి పిలుపునిచ్చారు. 

మెట్ పల్లిలో రైతులు ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios