వాతావరణ శాఖ అలర్ట్ : చలిపెరుగుతోంది.. జర భద్రం....
రెండు తెలుగు రాష్ట్రాలను చల వణికిస్తోంది. ఉదయం 9 గం.లవరకు పొగమంచు కమ్మేస్తుంది. మరో రెండు, మూడు రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరిగిపోతుంది. ఇల్లు దాటి బయటికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి నుంచి కాపాడుకోవడానికి చలి మంటలు వేసుకుంటున్నారు. పొగమంచు కమ్మేయడంతో రహదారులు పూర్తిగా పొగ మంచుతో నిండిపోయి ఎదురుగా ఏమొస్తుందో కనిపించడం లేదు. ఉదయం పూట లైట్లు వేసుకునే వాహనదారులు వెళ్లాల్సిన పరిస్థితి.
తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తాజాగా తెలిపారు. రాగల మరో రెండు, మూడు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ.. చలిగాలులు తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని తెలిపారు. చలిగాలుల కారణంగా తెలంగాణలో ఈరోజు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని సమాచారం.
మేడిగడ్డ పునరుద్దరణకు నో చెప్పిన ఎల్అండ్ టీ...
ఆంధ్రప్రదేశ్లో కూడా చలి వణికిస్తోంది. ఏజెన్సీ ఏరియాలో చలి పంజాతో ప్రజలు గడగడ వణికి పోతున్నారు. మిఛాంగ్ తుఫాన్ తర్వాత అల్లూరి జిల్లా పాడేరులో చలి విపరీతంగా పెరిగింది. దీనితోపాటు, ఇప్పుడు పెరుగుతున్నచలి తోడవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ ఏరియాలో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చలి, పొగ మంచు తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి మొదలైపోతుంది. పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి.