వయసులో వున్న ఓ మానసిన దివ్యాంగురాలిపై గుర్తుతెలియని కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన దారుణం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తాజాగా యువతి సైగలద్వాారా బయటపెట్టడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలుచేసినా, పోలీసులు మరెంత కఠినంగా వ్యవహరించినా మహిళలకు రక్షణ మాత్రం దక్కడంలేదు. ఆడవాళ్లు తమ కోరిక తీర్చే ఆటవస్తువులుగా భావించే కొందరు దుర్మార్గులు చిన్నపిల్లల నుండి పండుముసలి వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. చివరకు దివ్యాంగులు, మతిస్థిమితం లేని మహిళలపైనా అత్యాచారాలకు పాల్పడుతూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. ఇలా ఖమ్మం జిల్లాలో ఓ మానసిక దివ్యాంగురాలిని కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 బాధిత యువతి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఓ గ్రామంలో మతిస్థిమితం సరిగ్గాలేని 27ఏళ్ల యువతిని కుటుంబసభ్యులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. యువతిని ఇంట్లోంచి బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. కుటుంబసభ్యుల ఏమాత్రం ఏమరపాటుగా వున్నా ఇంట్లోంచి బయటకు వెళుతుండేది యువతి. ఇలా గత ఆదివారం రాత్రి 8గంటల సమయంలో ఇలాగే యువతి ఇంట్లోంచి బయటకు వెళ్ళింది. 

యువతి బయటికి వెళ్లినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు వెతకగా చాలాసేపటి తర్వాత గ్రామ శివారులో ఆమె కనిపించింది. ఒంటరిగా యువతి గ్రామశివారువరకు వెళ్లడంతో కుటంబసభ్యులకు అనుమానం కలిగింది. దీంతో రోడ్డుపై పలుచోట్ల వున్న సిసి కెమెరాలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి యువతిని బైక్ పై ఎక్కించుకుని తీసుకువెళుతూ కనిపించాడు. ఆమెను దుండగుడు రాయపట్నం-నందిగామ రహదారివైపు తీసుకువెళ్లినట్లు తెలిసింది.

తనపై అసలేం జరిగిందో తెలియని యువతి చాలాసేపటి తర్వాత సైగలు, కొన్ని మాటలు చెప్పింది. దీంతో ఆమెపై అత్యాచారం జరిగినట్లు కుటుంబసభ్యులు నిర్దారించుకున్నారు. వెంటనే యువతి తండ్రి తన కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరా ఫుటేజిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కనిపించిన బైక్, వ్యక్తి ఆనవాళ్ల ఆధారంగా నిందితున్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు మధిర పోలీసులు. 

ఇలా అభం శుభం తెలియని యువతిపై జరిగిన అత్యాచారం గ్రామంలో కలకలం రేపింది. యువతి గురించి తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు.వెంటనే నిందితున్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు.