పుట్టినప్పటి నుంచి మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్న అక్క పిల్లలను చూడలేక.. వాళ్లకు అక్క చేస్తున్న సేవలు చూడలేక ఓ మేనమామ మేనకోడల్ని, మేనల్లుడిని దారుణంగా హతమార్చాడు.. హైదరాబాద్ చైతన్యపురిలో జరిగిన ఈ సంఘటన అందరిని కంటతడి పెట్టిస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీ దంపతులకు 12 ఏళ్ల క్రితం కవలపిల్లలు పుట్టారు. కవలలని సంతోషించే లోపు వారిద్దరూ మానసిక వికలాంగులని తెలియడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.

అయినప్పటికీ పిల్లలకు సృజనరెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అయినప్పటికీ మనుసులో ఏదో తెలియని బాధతో లక్ష్మీ కుమిలిపోయేది.. అక్క బాధ చూడలేని తమ్ముడు మల్లిఖార్జున్ రెడ్డి పిల్లలిద్దరి అడ్డు తొలిగిస్తే.. సోదరికి కష్టాలు ఉండవని భావించాడు. పథకం ప్రకారం పిల్లలద్దరికి స్విమ్మింగ్ నేర్పిస్తానని నిన్న మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ చైతన్యపురిలోని తన రూమ్‌కి తీసుకువచ్చాడు.

అనంతరం తన రూమ్‌మేట్ వెంట్రామిరెడ్డి సాయంతో వారిద్దరినీ హత్య చేసి... శవాలను మాయం చేసేందుకు కారులో ఎక్కిస్తుండగా.. ఇంటి యజమాని మహేశ్ రెడ్డి ఏమైందని ప్రశ్నించాడు. పిల్లలకు ఒంట్లో బాగోలేదని ఆస్పత్రికి తీసుకువెళ్తున్నానని చెప్పాడు. అయితే మల్లిఖార్జున్ రెడ్డి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మల్లిఖార్జున్ రెడ్డి, అతని రూమ్‌మెట్, కారు డ్రైవర్ వివేక్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

తన పిల్లలను తమ్ముడు చంపాడని తెలుసుకున్న అక్క పరుగు పరుగున హైదరాబాద్‌కు వచ్చింది... మానసిక వికలాంగులు అయిన్పటికీ వారిద్దరినీ తాము బాగానే చూసుకుంటున్నామని రోదించింది. మరోవైపు పిల్లలు ఎలాగూ చనిపోయారని.. తన తమ్ముడిని వదిలివేయాలని లక్ష్మీ పోలీసులను కోరింది.