Asianet News TeluguAsianet News Telugu

హీరో ఫోటోతో గాలం వేసి.. లక్షలు కాజేశాడు

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. తల్లికి అనారోగ్యం అంటూ లక్షలు కాజేశాడు. భార్యకు తెలియకుండానే ఇంత కథా నడిపాడు.. చివరకు..
 

men held for cheating women through the matrimony website

హీరో ఫోటోతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసి ఓ యువతిని బోర్లా కొట్టించాడు. పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు కూడా చెప్పాడు. కొద్ది రోజుల పరిచయం తర్వాత.. తన తల్లికి బాలేదంటూ డబ్బులు నొక్కేశాడు. చివరకు అమెరికా పారిపోతూ పోలీసులకు చిక్కాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... మియాపూర్‌ ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన రాజూరి విక్రమ్‌(26) నర్సాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాడు. 2015లో అమెరికా వెళ్లి డల్లాస్‌లో వ్యాపారం ప్రారంభించాడు. అక్కడే స్థిరపడిన ఓ తెలుగు యువతిని 2016 జనవరిలో పెళ్లి చేసుకున్నాడు. జల్సాలకు డబ్బు కోసం తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. 

2017 అక్టోబరు 23న షాదీ.కాంలో అర్జున్‌ చంద్ర పేరుతో ప్రొఫైల్‌ను ఉంచాడు. అమెరికాలోనే ఉండటంతో అక్కడి చరవాణి నంబరునే నమోదు చేశాడు. ప్రొఫైల్‌ ఫోటో మాత్రం సినీ హీరో, చెన్నై మోడల్‌ సుజో మాథ్యూ ది ఉంచాడు. ఈ క్రమంలో కూకట్‌పల్లికి చెందిన ఓ యువతికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. సోషల్ మీడియాలో కొద్దిరోజులపాటు మాటల అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు.

మ్యాట్రిమోనీ సైట్‌లో తల్లి చిత్రంగా పేర్కొంటూ శాస్త్రవేత్త స్వాతి పరిమళ్‌ ఫొటోను జత చేశాడు. గత ఏడాది నవంబరు మొదటి వారంలో తన తల్లి అనారోగ్యంతో  ఉందని బాధితురాలికి చెప్పాడు. చికిత్స కోసం డబ్బును సమకూర్చాలంటూ ప్రాధేయపడ్డాడు. నిజమేనని నమ్మిన బాధితురాలు అతడి బ్యాంకు ఖాతాకి పలు రూ.6.67 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. 

ఆ డబ్బును తీసుకున్న తర్వాత నుంచి విక్రమ్‌ ఆమె ఫోన్‌కు స్పందించడం మానేశాడు. అప్పుడు తాను మోసపోయానని గ్రహించిన సదరు యువతి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, ఎస్సై విజయ్‌వర్ధన్‌ బృందం లుక్‌అవుట్‌ నోటీస్‌లు జారీ చేశారు.  గత నెలలో హైదరాబాద్‌కు వచ్చిన విక్రమ్‌ తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డగించారు. 

పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేసి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు అప్పగించారు. సోమవారం విక్రమ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. భార్యకు తెలియకుండా ఈ మోసానికి పాల్పడ్డ విక్రమ్‌ ఇంకా ఎవరినైనా మోసగించాడా..? అనేది ఆరా తీస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios