హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. రాజభవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు చిరంజీవి. చిరంజీవిని సాదరంగా ఆహ్వానించారు తమిళసై. ఈ సందర్భంగా గవర్నర్ కు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ సందర్భంగా సైరా సినిమా గురించి చిరంజీవి గవర్నర్ కు వివరించారు. సైరా సినిమాను చూడాలని కోరారు. ఈ సందర్భంగా సినిమా విజయవంతం అయినందుకు మెగాస్టార్ చిరంజీవికి తమిళ సై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతోపాటు స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించి చారిత్రక అంశాలతో కూడిన చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిరంజీవి గవర్నర్ కు వివరించారు. సినిమా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు.  

ఇకపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఈ సైరా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 2న గాంధీ జయంతి పురస్కరించుకుని విడుదలైంది. ఈ చిత్రానికి సురేంద్రరెడ్డి దర్శకత్వం వహించగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. 

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ తేజ్ నిర్మించారు. ఈచిత్రంలో చిరంజీవి, నయనతార, తమన్నా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబులు కీలక పాత్రలు పోషించారు.