నిజామాబాద్: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుటుంబసభ్యులపై ఆదివారం నాడు తేనేటీగలు దాడి చేశాయి. ఈ దాడి నుండి చిరంజీవి కుటుంబసభ్యులు తృటిలో తప్పించుకొన్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ కోటలో కామినేని ఉమాపతి రావు అంత్యక్రియలకు చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తో ఆయన భార్య ఉపాసన ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు.అనారోగ్యంతో కామినేని ఉమాపతిరావు ఈ నెల 27వ తేదీన మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలను ఇవాళ నిర్వహించారు.

ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవి ఇవాళ దోమకొండకు వచ్చారు. అంత్యక్రియల కార్యక్రమం సాగుతున్న సమయంలో స్థానికంగా ఉన్న చెట్టుపై నుండి తేనేటీగలు దాడికి దిగాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది తేనేటీగలను తరిమికొట్టే ప్రయత్నం చేశార. చిరంజీవితో పాటు అక్కడ ఉన్న వారంతా అక్కడి నుండి తప్పించుకొన్నారు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్లడంతో వారంతా తేనేటీగల దాడి నుండి తప్పించుకొన్నారు. 

తేనేటీగలు కుట్టడంతో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సమయంలో అక్కడే జిల్లా కలెక్టర్ కూడ ఉన్నారు. చిన్న తేనే తెట్టెకు సంబంధించిన తేనేటీగలు కుట్టాయి.తేనేటీగలు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. తేనేటీగల దాడితో కొద్దిసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.