తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి ప్రీతి మృతి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ప్రీతిది హత్యా?, ఆత్మహత్యా? అని పోలీసులు నిర్దారణకు రాలేకపోతున్నారని.. దీంతో ఈ కేసు వారికి సవాలుగా మారినట్టుగా తెలుస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి ప్రీతి మృతి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ప్రీతిది హత్యా?, ఆత్మహత్యా? అని పోలీసులు నిర్దారణకు రాలేకపోతున్నారని.. దీంతో ఈ కేసు వారికి సవాలుగా మారినట్టుగా తెలుస్తోంది. ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకుందనే ప్రచారం జరగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రీతి శరీరంలో ఏమైనా విష రసాయనాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఆమె నమునాలను సేకరించి టాక్సికాలజీ పరీక్షకు పంపారు. తాజాగా ఇందుకు సంబంధించిన నివేదిక పోలీసుల వద్దకు చేరింది. 

అయితే ప్రీతి నుంచి సేకరించిన నమునాల విశ్లేషణ ఆధారంగా ఆమె బాడీలో ఎలాంటి విషపదార్థాలు లేనట్టుగా రిపోర్టులో వెల్లడైనట్టుగా తెలుస్తోంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని ఆ రిపోర్టులో నిపుణులు పేర్కొన్నట్టుగా సమాచారం. దీంతో గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్‌తో స్పష్టమైంది. 

ఈ నేపథ్యంలో ప్రీతి కేసు పోలీసులకు సవాలుగా మారింది. మరోవైపు ప్రీతి ఆత్మహత్యా కాదని.. హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు, విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా మార్చే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వరంగల్ సీపీ రంగనాథ్ ఈ కేసు గురించి డీజీపీతో చర్చించేందుకు హైదరాబాద్‌ రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రీతి కేసు ఏ మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. 

ఈ కేసుకు సంబంధించి కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ప్రీతి సీనియర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. సైఫ్ కాల్ డేటాను సేకరించడంతో.. వాట్సాప్ చాట్‌ ఆధారంగా అతడిని ప్రశ్నించారు. అలాగే ఎంజీఎం ఆస్పత్రిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడి ఉన్న సమయంలో.. విధుల్లో ఉన్న సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందనేది తెలసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, కోర్టు సైఫ్‌కు విధించిన పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసింది. దీంతో పోలీసులు నేడు సైఫ్‌ను కోర్టులో హాజరుపరిచారు. అయితే సైఫ్‌ను పోలీసులు మరోసారి కస్టడీకి కోరుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.