Asianet News TeluguAsianet News Telugu

మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డికి విషమ పరీక్ష

తెలంగాణలో నిఖార్సైన అధికారుల జాబితాలో మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి పేరు కూడా ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు తన సర్వీసులో నిజాయితీగా పనిచేశారని చెబుతుంటారు. మేడ్చల్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయన ఇప్పుడు విషమ పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఈ పరీక్షలో ఆయన ఏ వైఖరి తీసుకుంటారు? ఇంతకూ ఆ విషమ పరీక్ష ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ స్టోరీ చదవండి.

medchel collector MV Reddy faces tough challenge in a land grab case

బేగంపేటలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు 150 కోట్ల విలువైన భూమి, 4 ఎకరాలు ఉంటుంది. దీన్ని కొందరు రిలయర్టర్లు కబ్జా చేశారు. ఆ రియల్టర్లకు తెలంగాణ మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రుల ఆశిస్సులు, అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈ బంతి (కేసు) ఇప్పుడు మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి కోర్టులో ఉంది. ఆయన వైఖరి ఎలా ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది.

 

ఈ భూకుంభకోణంపై బాధితులు చెబుతున్న వివరాలిలా ఉన్నాయి.

 

బేగంపేటలోని పాటిగడ్డలో ఎన్.డి.ఎల్ ఇన్ ఫ్రా ప్రయివేటు లిమిటెడ్ అనే సంస్థ వారు  పదో బ్లాక్ లోని 1వ వార్డులో భూమి తీసుకున్నారు. దీనికి 2014 డిసెంబరులో బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు. అదే సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ లో చేరి మంత్రిగా నియమితులయ్యారు.

 

2015 జూన్ ప్రాంతంలో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ వారు తమ కార్యకలాపాలు షురూ చేశారు. తమ భూమికి చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు. అయితే వారు తమ భూభాగంతోపాటు 1వ వార్డులోని 8వ బ్లాక్ లో ఉన్న ఖాళీ జాగాను కూడా కలుపుకుని ఫెన్సింగ్ కూడా నిర్మించారు. ఆ భూమి సుమారు 3ఎకరాల 10 గుంటలు ఉంటుంది. అది బస్తీ వాసుల భూమి అని అందరికి తెలిసిందే.

 

దీంతో బస్తీ ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. సదరు రియల్టర్ కంపెనీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తర్వాత బస్తీ వాసులు ఆ కంపెనీ ఆక్రమించిన భూమిని సర్వే చేయాలని పట్టుపట్టారు. 2016 జనవరిలో సర్వే కూడా జరిగింది. కానీ రెవెన్యూ  అధికారులను రియల్ కంపెనీ లోబరుచుకుంది. దీంతో ఆ రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ కంపెనీకి అనుకూలంగా సర్వే చేశారు. కంపెనీ ఆక్రమించుకున్న భూమి కంపెనీదే అని వాళ్లు తేల్చి హద్దులు నిర్ణయించేశారు.

 

అయినా బస్తీ వాసులు ఆందోళన విరమించుకోలేదు. ఇప్పుడు వారంతా కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డిని కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. జన చైతన్య వడ్డెర డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిప్రతం ఇచ్చారు.  ఆ సొసైటీ సెక్రటరీ జంగయ్య, సభ్యులు కూడా కలెక్టర్ ను కలిశారు.

 

medchel collector MV Reddy faces tough challenge in a land grab case

మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో కలెక్టర్ కు వినతిపత్రం ఇస్తున్న బాధితులు

 

కొత్తగా ఆ భూమిని మరోసారి నిష్పక్షపాతంగా సర్వే జరిపించాలని ఆ సొసైటీ సభ్యులు కోరుతున్నారు. తెలంగాణ సిఎం తనయుడు, మున్సిపల్ శాఖామంత్రి కెటిఆర్, హైదరాబాద్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ల ఆశిస్సులు భూకబ్జాదారులకు పుష్కలంగా ఉన్నాయని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ ఇద్దరు మంత్రుల అండదండలతోనే ఆ రిలయ్టర్లు రెచ్చిపోయి కబ్జా పర్వానికి దిగారని అంటున్నారు.

 

మరి ఇప్పుడు జిల్లా కలెక్టర్ గా ఉన్న ఎంవి రెడ్డి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అధికారంలో ఉన్న నాయకగణం మరోవైపు సామాన్య మానవులు వీరిద్దరిలో కలెక్టర్ ఏవైపు నిలుస్తారోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. బాధితుల పక్షాన నిలిచి ఆ వివాదాస్పద భూమిలో మరోసారి నిష్పాక్షిక సర్వే జరిపిస్తారా? లేక సర్వే అయిపోయింది కాబట్టి ఇంకేం చేయలేమని చేతులెత్తేస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఎంవి రెడ్డి కి ఉన్న ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం ఆయన ఎటువైపు ఉంటారన్న విషయంలో ఇప్పటికే ఒక అంచనాకు రావొచ్చన్న చర్చలు ఊపందుకుంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios